ఆలివర్ క్రోమ్‌వెల్, కర్రకు వేలాడదీసిన ఆలివర్ తల
పడుకున్న శవాన్ని లేపి మరీ చంపేస్తా.. ఓ సినిమాలో హీరో డైలాగ్ ఇది. ఏదో డైలాగు చెప్పడం వరకూ ఓకేగానీ.. నిజంగా అలా చంపుతారా ఎవరైనా? ఎందుకు చంపరు.. చరిత్రను తిరగేస్తే.. చచ్చినోళ్లను మళ్లా చంపిన సంఘటనలు చాలా ఉన్నాయి.తిరుగుబాట్లు, నమ్మక ద్రోహం, నేరాలకు పాల్పడటం వంటివాటితో పాటు.. చనిపోయినోళ్ల మీద తమ, ప్రతీకారం తీర్చుకోవడం వంటివి అందుకు కారణమయ్యాయి.
శవానికి ఉరేశారు..
ఆలివర్ క్రోమ్‌వెల్.. ఇంగ్లండ్ కామన్‌వెల్త్ దేశాలకు మొట్టమొదటి ప్రజాస్వామ్య పాలకుడు.1658 సెప్టెంబర్ 3న యూరినరీ ఇన్ఫెక్షన్‌తో చనిపోయాడు. కానీ 1661 జనవరిలో ఆయన శవాన్ని మళ్లీ ఉరితీశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. అప్పట్లో ఇంగ్లండ్‌ను కింగ్ చార్లెస్ పాలించేవాడు. ఆయన విధానాలు, ఇష్టమొచ్చినట్టుగా పన్నులు వేయడంతో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకు నేతృత్వం వహించిన ఆలివర్ నేతృత్వంలో తర్వాత ప్రభుత్వం ఏర్పాటైంది. కింగ్ చార్లెస్‌ను ఉరితీశారు. కొంతకాలానికి ఆలివర్ కూడా చనిపోయాడు.
తదనంతర పరిణామాల్లో రాజు అనుకూల సైన్యం ఎదురుతిరిగి.. కింగ్ చార్లెస్–2ను రాజును చేసింది. ఈ నేపథ్యంలో మొదటి కింగ్ చార్లెస్‌ను గద్దె దింపి, ఉరేయడానికి కారణమైన వారికి మరణశిక్షలు విధించారు. కారకుల్లో ఒకరైన ఆలివర్ అప్పటికే చనిపోయాడు.. అయినా.. వాళ్ల పగ తీరితేగా.. సమాధి నుంచి ఆయన శవాన్ని తీసి మరీ.. ఉరి వేశారు. అప్పటికీ కోపం తగ్గకపోవడంతో ఆలివర్ తలను నరికి.. 20 అడుగుల ఎత్తైన కర్రకు వేలాడదీశారు. సుమారు 25 ఏళ్లపాటు ఆ తల అలాగే వేలాడింది. చివరికి 1960లో దానిని కేంబ్రిడ్జిలోని ఓ రహస్య స్థలంలో పూడ్చిపెట్టారు.
శవపేటికతో సహా..
స్పెయిన్ ఆక్రమణలో ఉన్న నెదర్లాండ్స్ (డచ్) స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న రోజులవి. డచ్ పోరాటకారులు, స్పెయిన్ మధ్య 12 ఏళ్ల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఆ కాల్పుల విరమణ కాలంలో నెదర్లాండ్స్‌లోని యూట్రెచ్ రాష్ట్రాలకు సెక్రటరీగా ఉన్న గిల్లెస్ వాన్ లాడెన్‌బర్గ్.. చేసిన కొన్ని పనులు గొడవలు రేపాయి. దాంతో 1618లో అతడిని అరెస్టు చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటే.. తన ఆస్తులు, ఇతర అంశాలపై విచారణ ఆపేస్తారని లాడెన్‌బర్గ్ భావించి, ఉరేసుకున్నాడు. కానీ పాలకులు అతడిని వదల్లేదు. కుట్రదారుడిగా ప్రకటించి మరణశిక్ష వేశారు. లాడెన్‌బర్గ్ శవాన్ని శవపేటికతో సహా వేలాడదీశారు. ఇవి జస్ట్ ఉదాహరణలే.. పెద్దపెద్ద మతాధికారులకు కూడా చనిపోయిన తర్వాత ఉరేసిన ఘటనలో చరిత్రలో చాలా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment