వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు భారీ ఊరట ఇస్తూ ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ఈ తీర్పు ఎంతో ప్రమాదకరమైందన్న ఆయన.. దీని ద్వారా ట్రంప్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
వైట్ హౌస్‌లో బైడెన్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రాథమికంగా కొత్త సూత్రం. అమెరికా ప్రజలు డొనాల్డ్ ట్రంప్‌నకు మరోసారి అధ్యక్ష పదవిని అప్పగించాలనుకుంటున్నారా? అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. కోర్టు తీర్పుతో ట్రంప్ తనకు నచ్చిన పనులను చేయడానికి ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. అవినీతి చేయాలనుకున్నా చేస్తాడు. అవి విషయాలను తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఇది ఎంతో ప్రమాదకరం. అతనికి ఎలాంటి పరిమితులు లేవు’ అంటూ కామెంట్స్ చేశారు.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా జో బైడెన్..‘అమెరికాలో రాజులు లేరు అనే సూత్రం ఆధారంగా ఈ దేశం స్థాపించబడింది. చట్టం ముందు ప్రతీ ఒక్కరూ సమానమే. అంతకు మించి ఎవరూ లేరు. అమెరికా అధ్యక్షుడు కూడా కాదు. ప్రెసిడెన్షియల్ ఇమ్యునిటీపై సుప్రీంకోర్టు నిర్ణయంతో, అది ప్రాథమికంగా మారిపోయింది’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
This nation was founded on the principle that there are no kings in America.
Each of us is equal before the law. No one is above it.
Not even the President of the United States.
With today’s Supreme Court decision on presidential immunity, that fundamentally changed.— Joe Biden (@JoeBiden) July 2, 2024
ఇదిలా ఉండగా.. అధ్యక్ష ఎన్నికల్లో(2020) ప్రజాతీర్పును మార్చివేసేందుకు యత్నించారనే అభియోగాలను ఎదుర్కొంటున్న ట్రంప్‌నకు ఆ దేశ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. నేరాభియోగాల విచారణల నుంచి మాజీ అధ్యక్షులకూ మినహాయింపు ఉంటుందని సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును 9 మందితో కూడిన ధర్మాసనంలో ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించగా, ముగ్గురు న్యాయమూర్తులు వ్యతిరేకించారు. కోర్టు తాజా నిర్ణయంతో నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికలలోపు న్యాయస్థానాల్లో ట్రంప్‌ను విచారించే అవకాశాలు ఉండవు.
కాగా, ‘అమెరికా రాజ్యాంగంలో పొందుపరిచిన అధికారాల విభజనను అనుసరించి ప్రస్తుత అధ్యక్షునికి ఉన్నట్లే మాజీ అధ్యక్షునికి నేరాభియోగ విచారణ నుంచి సంపూర్ణ మినహాయింపు ఉంటుంద’ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ తీర్పులో పేర్కొన్నారు. అధ్యక్షుని అధికారిక చర్యలు అన్నిటికీ విచారణ నుంచి రక్షణ ఉంటుందని, అనధికారిక చర్యలకు మాత్రం మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు.
ఇక, సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ స్పందిస్తూ..‘మన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఇది భారీ విజయం. అమెరికా పౌరుడిగా గర్విస్తున్నా’నని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ తీర్పుతో నవంబర్ 5వ తేదీన జరగబోయే అధ్యక్ష ఎన్నికల వరకు.. ట్రంప్ కోర్టు విచారణను ఎదుర్కొనే అవకాశాలు లేవనే చెప్పాలి. అదే టైంలో న్యూయార్క్ హష్ మనీ కేసులో దోషిగా తేలిన ట్రంప్.. తాజా తీర్పు ఆధారంగా మళ్లీ కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నారు.
సోషల్ మీడియాలో ట్రంప్‌నకు అనుకూలంగా వచ్చిన తీర్పుపై తీవ్ర చర్చ నడుస్తోంది. జులై 4వ తేదీన రాజుల నుంచి అమెరికాకు స్వాతంత్ర్యం లభిస్తే.. జులై 1వ తేదీన అధ్యక్షుడే ఈ దేశానికి రాజంటూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment