తప్పేను నీటిచింత | Sakshi
Sakshi News home page

తప్పేను నీటిచింత

Published Fri, Apr 19 2024 1:50 AM

జగిత్యాల మున్సిపల్‌ కార్యాలయంలో గతంలో నిర్మించిన ఇంకుడుగుంత - Sakshi

జగిత్యాల: మున్సిపాలిటీల్లో జల సంరక్షణకు మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎండలు ముదిరిపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. దీనికి విరుగుడుగా ఇంకుడుగుంతలు నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో మున్సిపల్‌ అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్న నిర్ణయం పాతదే అయినా.. కొద్దిరోజులుగా దీనిపై పట్టింపు కరువైంది. ఈ నేపథ్యంలో దానికి పక్కాగా అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే వార్డుల్లో వ్యక్తిగత, వాణిజ్య, అపార్ట్‌మెంట్ల వారీగా సర్వే చేపడుతున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఈ సర్వే కొనసాగుతోంది. ప్రధానంగా 300 చదరపు మీటర్లు కలిగిన ఇంటితోపాటు ఇతర ఏ కట్టడమైనా ఇంకుడుగుంత ఉండేలా చూడాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఇంజినీరింగ్‌, టౌన్‌ప్లానింగ్‌, శానిటేషన్‌ అధికారులు కమిటీగా ఏర్పడి సర్వే చేస్తున్నారు.

నిబంధనలు ఎక్కడ..?

గతంలోనూ ఇంటి నిర్మాణం చేపట్టుకునే వారు ఇంకుడుగుంత నిర్మిస్తేనే అనుమతి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి నిబంధన ఉన్నప్పటికీ అమలులో మాత్రం ఆచరణకు లేదు. టీఎస్‌బీపాస్‌ చట్టం ప్రకారం ఇంటి నిర్మాణానికి అనుమతి పొందాలంటే ఆన్‌లైన్‌లో ఇంటి నిర్మాణంతోపాటు, ఇంకుడు గుంతకు సైతం ప్రత్యేక రుసుం కింద రూ.2 వేలు చెల్లించాలి. ఇంకుడు గుంతలకు డబ్బులు ప్రతిఒక్కరూ చెల్లిస్తున్నారుగానీ ఎవరూ నిర్మించడం లేదు. ఇంకుడు గుంత నిర్మిస్తే తిరిగి ఆ రూ.2 వేలు పొందే అవకాశం ఉంది. అది ఎక్కడ కూడా అమలుకు నోచుకోవడం లేదు.

మున్సిపాలిటీల్లో రుసుం

ఈ ఇంకుడు గుంతల నిర్మాణం కోసం ప్రతిఇంటి యజమాని రూ.2 వేలు చెల్లిస్తుంటారు. ఇంటి నిర్మాణం పూర్తయిన అనంతరం ఇంకుడుగుంతను చూపించి ఆ రూ.2 వేలు తీసుకునే అవకాశం ఉంది. దీనిపై సరైన అవగాహన లేకనో..? లేక ఇంకుడుగుంత నిర్మించకపోవడమో..? మరే కారణమోగానీ మున్సిపాలిటీల్లోనే ఆ నిధులు మూలుగుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో గతేడాది 650 ఇళ్ల నిర్మాణాలు జరుగగా.. ఇంటికి రూ.2వేల చొప్పున నిధులు బల్దియాలోనే మూలుగుతున్నాయి. ఇలా ఏటా రూ.లక్షల్లో ఇంకుడుగుంతల ఫీజు అలానే ఉండిపోతోంది. గతంలో వీటి నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి.

నిర్వహణ ఎక్కడ..?

2018లో ప్రభుత్వం ప్రతి జిల్లా కార్యాలయంలో ఇంకుడుగుంతలు ఉండాలని ప్రత్యేక నిధులు మంజూరుచేయగా.. ప్రతి కార్యాలయంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. కానీ నిర్లక్ష్యంతో అవి కాస్త మరుగున పడిపోయాయి. ప్రతి మున్సిపాలిటీతోపాటు, ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్మించగా పిచ్చిమొక్కలు, పూడికతో నిండిపోయాయి. తాత్కాలికంగా మరమ్మతు చేపడితే ఇంకుడు గుంతలు ఉపయోగంలోకి వచ్చే అవకాశాలుంటాయి.

ఇంకుడు గుంతలతో మేలు

ఇంకుడుగుంతల నిర్మాణాలతో భూగర్భజలాలు పెంపొందించుకునే అవకాశాలుంటాయి. ప్రతి చోటా ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడితే వర్షకాలంలో వృథాజలాలు సాధ్యమైనంత మేర భూమిలోకి ఇంకి తాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయి. ప్రస్తుతం భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

ప్రతి ఇంటి ఆవరణలో ‘జలసంరక్షణ’ తప్పనిసరి

ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

మున్సిపాలిటీల్లో ప్రారంభమైన సర్వే

పాతదే అయినా పక్కాగా అమలుకు నిర్ణయం

Advertisement
Advertisement