అద్దె భవనాలు.. అరకొర వసతులు
● మంజూరు ఓ చోట.. నిర్వహణ మరోచోట● ఏళ్ల తరబడి అంతంత మాత్రంగానే సౌకర్యాలు ● అవస్థల మధ్య చదువు సాగిస్తున్న విద్యార్థులు ● ఇదీ జిల్లాలోని బీసీ గురుకులాల పరిస్థితి
మెట్‌పల్లి: జిల్లాలోని మహాత్మ జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల నిర్వహణ అధ్వానంగా తయారైంది. కొన్ని పాఠశాలలను మంజూరైన చోట కాకుండా మరోచోట అద్దె భవనాలు, అరకొర వసతుల మధ్య నిర్వహిస్తుండడం విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. నిరుపేదల పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసింది. అద్దె భవనాల్లో నెలకొల్పిన వీటికి ఆ తర్వా త ఏళ్లు గడుస్తున్నా సొంత భవనాలను సమకూర్చడం లేదు. దీంతో అసౌకర్యాల మధ్యనే విద్యార్థులు చదువు కొనసాగించాల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో ఎనిమిది పాఠశాలలు
● జిల్లా మొత్తంగా వివిధ ప్రాంతాల్లో ఎనిమిది బీసీ గురుకులాలు ఉన్నాయి.
● ఇందులో ఆరు పాఠశాలలను ఇంటర్, ఒక పాఠశాలను డిగ్రీ వరకు అప్‌గ్రేడ్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
● ఉన్న వాటిలో కొన్ని మంజూరైన చోట కాకుండా మరోచోట నిర్వహిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
● పెగడపల్లికి మంజూరైన పాఠశాలను గొల్లపల్లిలో.. మేడిపల్లి మండలంలోని సింగరావుపేట పాఠశాలను రాయికల్ మండలంలోని అల్లీపూర్‌లో.. మెట్లచిట్టాపూర్, బీర్‌పూర్ పాఠశాలలను మెట్‌పల్లిలో నిర్వహిస్తున్నారు.
● ఆయా పాఠశాలల మంజూరు సమయంలో భవనాలు, ఇతరత్రా వసతులు పరిశీలించకపోవడంతో వాటిని మరోచోట ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అధికారులు చెబుతున్నారు.
సౌకర్యాలు అంతంతే..
● దాదాపు పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
● వీటిలో విద్యార్థులకు సరిపడా సౌకర్యాలను ప్రభుత్వం కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి.
● ప్రధానంగా చాలాచోట్ల విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, గదులు, నీటి వసతి వంటివి లేవు.
● కొన్ని పాఠశాలల్లో భద్రత కరువైంది. రక్షణ చర్యల్లో భాగంగా అవసరమైన చోట గ్రిల్స్‌ను ఏర్పాటు చేయాలి. అవి లేకపోవడంతో విద్యార్థులు తరచూ పారిపోతున్నా.. అధికారులకు పట్టడం లేదు.
● అలాగే ఆటలు ఆడుకునేందుకు స్థలం లేకపోవడంతో వాటికి దూరంగా ఉంటున్నారు.
ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
● పాఠశాలల్లో సరైన వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
● ఒక్కో భవనానికి నెలకు రూ.లక్షల్లోనే ప్రభుత్వం అద్దె చెల్లిస్తోంది. అయినా కొన్నిచోట్ల భవన యజమానులు సౌకర్యాల కల్పనపై నిర్లక్ష్యం చూపుతున్నారు.
● మెట్‌పల్లిలో ఓ పాఠశాల కిటికీలకు కనీసం తలుపులు పెట్టలేదు. దీంతో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు.
● ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలల్లో సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలను తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఇది పట్టణంలో ఉన్న బీసీ బాలుర గురుకుల పాఠశాల. బీర్‌పూర్ మండలకేంద్రానికి మంజూరైన దీనిని గత్యంతరం లేని పరిస్థితుల్లో మెట్‌పల్లిలో నెలకొల్పారు. ఇది కూడా అద్దె భవనంలో నామమాత్రపు వసతుల మధ్య కొనసాగుతోంది. సరైన సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఇది మెట్‌పల్లి పట్టణంలో ఉన్న మహాత్మాజ్యోతి బాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల. మండలంలోని మెట్లచిట్టాపూర్ పేరిట మంజూరైంది. అక్కడ పాఠశాల ఏర్పాటుకు అనుకూలమైన భవనాలు లేవనే కారణంతో ప ట్టణ శివారులోని ఓ అద్దె భవనంలో పాఠశాల ను నిర్వహిస్తున్నారు. ఇందులో వసతులు సరి గా లేక విద్యార్థినులు ఇబ్బంది పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment