అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: అప్పుల బాధతో ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అనిల్, కుటుంబ సభ్యుల కథ నం ప్రకారం.. గ్రామానికి చెందిన పిట్ల లింగన్న అలియాస్ తోకల లింగన్న (41) తనకున్న పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నాడు. ఈ ఖర్చుతోపాటు పంటల సాగుకు పెట్టుబడి పెడుతున్నాడు. ఇలా మొత్తం సుమారు రూ.15 లక్షల వరకు అప్పు అయ్యింది. వాటిని ఎలా తీర్చాలని నిత్యం మదనపడుతున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 14న తన పొలానికి వెళ్లాడు. ఎంతకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెదుకగా క్రిమిసంహారక మందు తాగి పడిపోయి కనిపించాడు. వెంటనే అతడిని మెట్‌పల్లిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం వేకువజామున మృతి చెందాడు. లింగయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. లింగన్న భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
వృద్ధుడి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం: మండలంలో ని గోదూర్ గ్రామానికి చెందిన రెబ్బాస్ ఆశన్న (72) క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అనిల్ కథనం ప్రకారం.. ఆశన్న భార్య శాంత మూడు నెలల క్రితం గుండెపోటుతో చనిపోయింది. అప్పటి నుంచి తీవ్రంగా మదనపడుతున్నాడు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. చిన్న కుమారుడు శాంతకుమార్ గమనించి వెంటనే మెట్‌పల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఆశన్న పెద్ద కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment