![ఆగం పనులు.. అవస్థల్లో ప్రజలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/04krt09-180033_mr-1738871043-0.jpg.webp?itok=XB1U75iC)
ఆగం పనులు.. అవస్థల్లో ప్రజలు
● నీటి ఒత్తిడికి తట్టుకోని పైప్‌లైన్లు
● తరచూ తప్పని మరమ్మతు
కోరుట్ల: సుమారు రూ.1250 కోట్లు ఖర్చుతో జిల్లావ్యాప్తంగా సురక్షిత తాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన మిషన్‌భగీరథ పథకం తర చూ మరమ్మతులతో నీరుగారిపోతోంది. ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలో ఆరేళ్ల క్రితం గ్రిడ్ ఏర్పాటు చేసి నీటి సరఫరా ప్రారంభించారు. అప్పటినుంచి ఎక్కడోచోట పైప్‌లైన్ దెబ్బతిని నీరు వృథా అవుతోంది. రోజుల తరబడి గ్రామాలు, పట్టణాలకు నీటి సరఫరా నిలిచిపోతోంది.
పైప్‌లైన్లలో లోపాలు
డబ్బా మిషన్ భగీరథ కింద మెట్‌పల్లి, జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి మున్సిపాలిటీలతోపాటు మరో 246 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు వంద కిలోమీటర్ల మేర పైప్‌లైన్లు లింకు చేసి చివరివరకూ నీరందించేలా ఏర్పాట్లు చేశారు. పైప్‌లైన్లు లింక్ చేసే సమయంలో అప్పటి ఆర్‌డబ్లూఎస్ అధికారులు కాస్త హడావుడితో ఆగమేఘాల మీద బిగించారు. డబ్బా నుంచి మెట్‌పల్లి మున్సిపాలిటీకి వచ్చే ప్రాంతంలో సుమారు ఏడు చోట్ల పైప్‌లైన్ల బిగింపులో లోపాలు ఉన్నాయి. కొన్ని చోట్ల వంపులు తిరిగి ఉండడంతో నీటి ఒత్తిడి పెరిగి పైప్‌లైన్ తరచూ దెబ్బతింటోంది. ఇలాంటి లోపాలు రెండుమూడు నెలలకోసారి వస్తుండటంతో మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల మున్సిపాల్టీలకు నీటి సరఫరాలో ఆటంకం కలుగుతోంది. ఎండాకాలం సమీపించడంతో మిషన్ భగీరథ నీటి సరఫరాలో లోపాలు వస్తే జనం మరింత ఇబ్బంది పడతారనే ముందుచూపుతో ప్రస్తుతం పూర్తిస్థాయిలో మరమ్మతుకు శ్రీకారం చుట్టారు. మెట్‌పల్లి మండలం వెంకట్రావ్‌పేట పరిసరాల్లోని మెయిన్ పైప్‌లైన్ పనులు చురుకుగా సాగుతున్నాయి.
నీటి కోసం తిప్పలు
నీటి సరఫరాలో లోపాలు తలెత్తినప్పుడు అధికారులు వెంటనే సరిచేస్తుండటంతో పెద్దగా సమస్య రాలేదు. ప్రస్తుతం వారంపది రోజులుగా నీటి సరాఫరా ఆగిపోవడం.. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడం సమస్యగా మారింది. రెండు పట్టణాల్లోనూ మున్సిపాల్టీలకు కేవలం నాలుగు నుంచి ఐదు వాటర్ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంకర్ల ద్వారా రెండు మున్సిపాల్టీల్లో నీటి కొరత ఉన్న ఏరియాలకు సరఫరా చేయడం తలకు మించిన భారంగా మారింది. నీటి కోసం ప్రజలు, మాజీ ప్రజాప్రతినిధుల నుంచి వస్తున్న ఒత్తిళ్లు తట్టుకోలేక మున్సిపల్ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. దీంతో ఇటీవల కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని మిషన్‌భగీరథ కాంట్రాక్టర్లతో మాట్లాడి పైప్‌లైన్ మెయింటనెన్స్ ఖర్చులు వారే భరించేలా చూశారు. పైప్‌లైన్ లోపాలను శాశ్వత ప్రాతిపదికను బాగు చేసే పనులు త్వరితగతిన పూర్తి చేస్తే జనం ఇబ్బందులు తొలగుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment