ముగిసిన డేటా ఎంట్రీ
జనగామ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ముగిసింది. కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్‌సింగ్ ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఇంటింటా సర్వే విజయవంతంగా సాగింది. నవంబర్ 6 నుంచి 8 వరకు ఇంటింటికీ స్టిక్కరింగ్ వేసిన అధికారులు.. 9వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సర్వే పూర్తి చేశారు. జిల్లా ప్రత్యేక అధికారి వినయ్‌కృష్ణారెడ్డి సర్వేను ఆకస్మికంగా తనిఖీ చేసి కలెక్టర్‌తో రివ్యూలు నిర్వహించారు. సర్వే సమయంలో ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడంతో విజయవంతంగా ముగించారు.
1,77,044 ఇళ్లలో సర్వే..
జిల్లాలోని 12 మండలాలతోపాటు జనగామ అర్బన్ కలుపుకుని 1,77,044 ఇళ్లలో సర్వే చేయగా.. రెండు రోజుల క్రితం వందశాతం డేటా ఎంట్రీ ప్రక్రియ ముగిసింది. రూరల్ ఏరియాలో 1,61,355, అర్బన్‌లో 15,689 ఇళ్లలో కుటుంబాలకు సంబంధించిన వివరాలను సేకరించారు. ఇందుకు 1,350 బ్లాక్‌లను ఏర్పాటు చేయగా.. 1,669 ఎన్యుమరేటర్లు పని చేయగా, 184 మంది సూపర్‌వైజర్లు పర్యవేక్షణ చేశారు. ఒక్కో కుటుంబానికి 75 ప్రశ్నల చొప్పున పార్ట్ –1, 2 కేటగిరీలు విభజించి, కుటుంబ యజమాని, సభ్యుల వివరాలను సమగ్రంగా నమోదు చేశారు. నవంబర్ 23 నుంచి జిల్లా వ్యాప్తంగా కుటుంబ సర్వేకు సంబంధించిన డేటా ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించారు. జనగామ కలెక్టరేట్–85, బచ్చన్నపేట–20, దేవరుప్పుల–35, నర్మెట–20, పాలకుర్తి –15, క్రీస్తుజ్యోతి–30, లింగాలఘణపురం–30, చిల్పూరు–25, స్టేషన్‌ఘన్‌పూర్–35, కొడకండ్ల–25, రఘునాథపల్లి–40, జఫర్‌గఢ్–25 కంప్యూటర్లను ఏర్పాటు చేసి ఈ–డిస్ట్రిక్ మేనేజర్ గౌతమ్‌రెడ్డి ఆధ్వర్యంలో డేటా ఎంట్రీని పూర్తి చేశారు.
తప్పులు లేకుండా..
ఇంటింటా సేకరించిన కుటుంబ సర్వే వివరాలను డేటా ఎంట్రీ చేసే సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. డేటా ఆపరేటర్లు, పంచాయతీ కార్యర్శులు, ఇతర శాఖల సిబ్బంది ఆధ్వర్యంలో డేటా ఎంట్రీ చేశారు. ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఎన్యుమరేటర్ల పర్యవేక్షణలో ఎంట్రీ చేయగా, తప్పులు దొర్లకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించిన తర్వాత సడ్మిట్ చేశారు.
ఎంపీడీఓ, మున్సిపల్
కార్యాలయంలో ప్రత్యేక సెల్
జిల్లాలో కుటుంబ సర్వే ముగిసినప్పటికీ ఆయా మండలాలు, అర్బన్‌లో కొన్ని చోట్ల పలు కుటుంబాలకు సంబంధించి సర్వే పెండింగ్ ఉన్నాయి. ఎన్యుమరేటర్లు ఇంటికి వెళ్లిన సమయంలో తాళం వేసి ఉండడం తదితర కారణాలతో పాటు వలస వెళ్లిన వారు కొంతమంది ఉన్నారు. ఆ కుటుంబాలకు మరో అవకాశం ఇచ్చారు. మండలాల పరిధిలో ఎంపీడీఓ, అర్బన్‌లో మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. సర్వేలో మిగిలిన కుటుంబాలు అక్కడకు వెళ్లి తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ప్రతీ కుటుంబం సర్వేలో పాల్గొనాలని ప్రభుత్వం సంకల్పించిన నేపధ్యంలో మిగిలిన కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
డేటా ఎంట్రీ ముగిసింది..
జిల్లాలో కుటుంబ సర్వే డేటా ఎంట్రీ ప్రక్రియ ముగిసింది. కలెక్టరేట్‌తో పాటు మండలపరిషత్, తహసీల్దార్, కళాశాలలు, కంప్యూటర్లు అందుబాటులో ఉన్న చోట డేటా ఎంట్రీ చేయించాం. ఎక్కడ కూడా తప్పులు దొర్లకుండా పర్యవేక్షణ చేశాం. కుటుంబ సర్వే సమయంలో మిగిలిన కుటుంబాలు మండలాల పరిధిలో ఎంపీడీఓ, అర్బన్‌లో మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి తమ వివరాలను నమోదు చేసుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రిజ్వాన్ బాషా, కలెక్టర్
మిగిలిన కుటుంబాలకు మరోచాన్స్
ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక సెల్
20 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ
Comments
Please login to add a commentAdd a comment