ఊరూరా ఇసుక దందా!
సాక్షిప్రతినిధి, వరంగల్ : జడలు విప్పుతున్న ఇసుక మాఫియాను అరికట్టాల్సిన ప్రభుత్వశాఖల అధికారులు కొందరు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాల్సిన పోలీసు, పంచాయతీరాజ్, అటవీ, రెవెన్యూ, టీజీఎండీసీ, ఇరిగేషన్, మైనింగ్ తదితర శాఖలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నదీతీరాలు, వాగుల్లోనుంచి రాత్రనక, పగలనక యథేచ్ఛగా ఇసుక తవ్వుతున్నారు. ‘మాఫియా’గా అవతారమెత్తిన వ్యాపారులు ఈ ఇసుకను ట్రాక్టర్ల ద్వారా సమీప పట్టణాలు, నగరాల్లో డంప్ చేసి హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు లారీలు, టిప్పర్ల ద్వారా తరలించి విక్రయిస్తున్నారు.
వాగులు తోడేస్తున్న అనకొండలు..
జేఎస్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం కలికోట, వెంకట్రావుపల్లి ఇసుక దందాకు ప్రధాన అడ్డాగా మారాయి. ట్రాక్టర్ల స్పీడు, తాకిడికి విసిగి వేసారిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఒక్కటై ఇటీవల ఫిర్యాదు చేస్తే.. గంటలో పోలీసులు 8 లారీలను పట్టుకుని సీజ్ చేశారంటే దందా ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. చిట్యాల మండలం నవాబుపేట శివారులోని చలివాగు, మొగుళ్లపల్లి మండలం పెద్దవాగు నుంచి తవ్వుతున్నారు. అనుమతుల మాటున కొన్నయితే.. అనధికారికంగా, అక్రమంగా మరికొన్ని చోట్ల తవ్వకాలు చేపడుతూ రేగొండ మండలం దమ్మన్నపేట ద్వారా పరకాలకు తరలిస్తున్నారు. డిమాండ్, దూరాన్ని బట్టి ట్రాక్టరుకు రూ.3,500 నుంచి రూ.10వేల వరకు.. లారీ అయితే కెపాసిటీని బట్టి సుమారు రూ.38 వేల నుంచి రూ.55 వేల వరకు అమ్ముతున్నట్లు సమాచారం. టేకుమట్ల, చిట్యాల, రేగొండ మండలాల పరిధి గ్రామాల ప్రజలు ఇసుక ట్రాక్టర్లు, లారీల స్పీడుకు భయాందోళనలకు గురవుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టినా.. విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ కిరణ్‌ఖరే పలుమార్లు హెచ్చరించినా స్థానికంగా పర్యవేక్షణ లేక అక్రమాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సొంత అవసరాలకు ప్రజలు ఇసుకను తీసుకుంటే ఇబ్బంది పెట్టవద్దని ఓ ప్రజాప్రతినిధి అధికారులకు చేసిన సూచనను ఆసరాగా చేసుకుని దందా చేసే వ్యాపారులు సైతం అధికారుల వద్ద ఆయన పేరునే వాడుకుంటుండటం కొసమెరుపు.
ఉమ్మడి జిల్లాలో ఇదే తీరు..
ఉమ్మడి వరంగల్‌లోని మున్సిపాలిటీలు, పట్టణాల్లో ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది.
మహబూబాబాద్ జిల్లాలోని పలు ఏజెన్సీ మండలాల్లో గిరిజనేతరులు ఇసుక అమ్మకానికి అనుమతి ఉండదు. గూడూరు లాంటి చోట కూడా గోదావరి ఇసుక పేరుతో అమ్మకాలు సాగుతున్నాయి. ఆకేరు, మున్నేరు వాగుల నుంచి ఇసుక తరలింపును నిషేధించినా కొందరు రాత్రి వేళ వాగుల నుంచి తెస్తున్నారు. ఈ క్రమంలో ప్రజల అవసరాలను ఆసరా చేసుకుని అధికారులకు మామూళ్లు ఇవ్వాల్సి వస్తోందంటూ రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయిస్తున్నారు. నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి, ఎర్రబెల్లిగూడెం, బ్రాహ్మణకొత్తపల్లి, నెల్లికుదురు, మునిగలవీడు గ్రామాల శివారు ఆకేరు వాగు నుంచి అర్ధరాత్రి రవాణా కొనసాగుతోంది. గూడూరు మండలం కొల్లాపురం శివారు మున్నేరు వాగును కూడా వదలిపెట్టడం లేదు. టీఎస్‌ఎండీసీలో రిజిస్టర్ అయిన లారీల యజమానులు, డ్రైవర్లతో కుమ్మకై ్క తప్పుడు పత్రాలతో వరంగల్ జిల్లా నర్సంపేటలో 25 మందికి పైగా ఇసుకను తెప్పించుకుంటూ డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్‌కు రూ.5వేల నుంచి 6 వేల వరకు విక్రయిస్తున్నారు.
హనుమకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఆకేరు వాగులో ఇసుక దందా జోరుగా సాగుతోంది. ఎల్కతుర్తి, పరకాల మండలాల్లోనూ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పరిధిలోని కొత్తపల్లి, ల్యాబర్తి, కట్రాల గ్రామాల్లో ఆకేరు వాగు పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పట్టా భూముల్లో కొన్నేళ్లుగా మట్టిని ఇసుకగా మార్చే దందా సాగుతోంది.
జనగామ జిల్లా దేవురుప్పుల మండలంలోని ఓ కా లనీలో ఏకంగా 60 ట్రాక్టర్లు ఇసుక అక్రమ రవాణా కోసమే పనిచేస్తున్నాయి. రఘునాథపల్లి మండలానికి చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ ప్రాంతంలోని ఇసుక, మట్టి దందా నాయకుల గురించి ఇటీవల పోలీసులకు పదికి పైగా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదు. పాలకుర్తి, జనగామల చుట్టూ కూడా ఇసుక అక్రమ దందా సాగుతోంది.
బహిరంగంగా సాగుతున్నా..
షరా ‘మామూలే’
టేకుమట్ల, చిట్యాల, రేగొండలో
విచ్చలవిడి..
దుమ్మురేపుతున్న ట్రాక్టర్లు..
హడలిపోతున్న జనాలు
ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా వాగుల్లో ఇసుక దందా
Comments
Please login to add a commentAdd a comment