బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది! | - | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది!

Published Wed, Dec 11 2024 1:29 AM | Last Updated on Wed, Dec 11 2024 1:29 AM

బెంగా

బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది!

గోదావరి దాటి ములుగు జిల్లాలోకి ప్రవేశించిన పులి

మల్లూరు గుట్టవైపు వెళ్లినట్లు చెబుతున్న అటవీశాఖ అధికారులు

వాటర్‌ పాయింట్లలో క్యాప్చరింగ్‌కు ప్రయత్నం

ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ సీజన్‌లోనూ రాక

వచ్చింది మగపులిగా నిర్ధారణ

మేటింగ్‌ సమయం కావడంతో

ఆడపులి కూడా ఉండొచ్చని అనుమానం

గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని సూచన

ములుగు: ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నాలుగు రోజులపాటు కలవరం సృష్టించిన పులి ములుగు జిల్లాలోకి ప్రవేశించినట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఆదిలాబాద్‌, మంచిర్యాల, చెన్నూరు దాటుకుంటూ మంగళవారం గోదావరి తీరం వెంబడి ఉన్న వెంకటాపురం(కె) మండలంలోని బోదాపురంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు తమ పరిధిలోని ట్రాపింగ్‌ కెమెరాలు, అడుగు జాడలు, సంచారానికి సంబంధించిన విషయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలోకి వచ్చింది బెంగాల్‌ టైగర్‌గా గుర్తించారు. బెంగాల్‌ టైగర్‌ ఏజెన్సీలోకి రావడం ఇదే మొదటిసారి అని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ సంయోగానికి వచ్చి ఉంటే ఆడపులి ఏటూరునాగారం –కొత్తగూడ వైల్డ్‌లైఫ్‌ ఏరియాలో ఉండే ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన మగపులి గోదావరి తీరం దాటి వెంకటాపురం(కె) మండలం, మంగపేట మండలం చుంచుపల్లి ఏరియా మీదుగా మల్లూరు గుట్టవైపు వెళ్లినట్లుగా అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. పులి జాడలను తెలుసుకోవడానికి గతంలో ఏర్పాటు చేసిన కెమెరాలతో పాటు ప్రస్తుతం వాటర్‌ పాయింట్‌ ఏరియాల్లో కెమెరాలను బిగించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు పులి అలజడికి సంబంధించి ఎలాంటి ఆధారాలూ కెమెరాల్లో క్యాప్చర్‌ కాలేదని అధికారులు చెబుతున్నారు. బెంగాల్‌ టైగర్‌ ఏజెన్సీలోకి ప్రవేశించిన విషయం తెలుసుకున్న గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు.

మేటింగ్‌ సీజన్‌..

ప్రతీఏడాది చలికాలంలో పెద్దపులులు సంయోగం(మేటింగ్‌) కోసం సంచరిస్తూ ఉంటాయి. అటవీ రికార్డుల ప్రకారం మగపులి ఆడపులితో సంయోగం చెందడానికి వాసన ఆధారంగా ముందుకు అడుగులు వేస్తుంది. ఇదే క్రమంలో ఆడపులి సైతం మగపులి వాసనను పసిగడుతూ అటువైపుగా ఆకర్షితమవుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. బెంగాల్‌ టైగర్‌గా భావిస్తున్న మగపులి ప్రతిరోజూ 20 కిలోమీటర్ల వరకు సంచరిస్తుంది. రాష్ట్ర సరిహద్దులోని ఆదిలాబాద్‌ నుంచి 120కిలో మీటర్లు దాటి ములుగు జిల్లాలోకి వచ్చిందంటే ఈ పరిధిలో సంయోగానికి మరో ఆడపులి ఉండే ఉంటుందని వన్యప్రాణి ప్రేమికులు చెబుతున్నారు. పులి ఆరు రోజులుగా ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఏజెన్సీలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. పులి సంయోగ సమయంలో ఆందోళనగా ఉంటుందని వన్యప్రాణి విభాగ అధికారులు చెబుతున్నారు. ఈ విషయం తెలియడంతో జిల్లాలోని బోర్డర్‌ ప్రాంతాల ఆదివాసీ గూడేలు, గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవువుతున్నారు. 2022, 2023 సంవత్సరాల్లో చలికాలంలో పులులు జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్‌ ఏరియాలో సంచరించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే సంచార సమయంలో జిల్లాలోకి వచ్చిన పులుల్లో ఒకటి ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలో వేటగాళ్ల ఉచ్చులకు బలికాగా, మరో రెండు పులులు(ఎస్‌–1), ఓ చిరుత పులి క్షేమంగా అడవులను దాటుకుంటూ వాటి వాటి గమ్యస్థానాలను చేరుకున్నాయి.

ప్రజలు భయాందోళనకు గురికావొద్దు

జిల్లాలోకి బెంగాల్‌ టైగర్‌ ప్రవేశించిన మాట వాస్తవం. ప్రస్తుతం మంగపేట మండలం చుంచుపల్లి– మల్లూరుగుట్ట అటవీ ప్రాంతంలో ఉన్నట్లుగా గుర్తించాం. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. ఉదయం, సాయంత్రం పూట పంట పొలాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే క్రమంగా ఒంటరిగా వెళ్లొద్దు. సాధ్యమైనంత వరకు గుంపులు, గుంపులుగా ఉండడం మంచింది. ఎక్కడైనా పులి పులి సంచారం వివరాలు తెలిస్తే వెంటనే స్థానిక అటవీ అధికారులకు సమాచారం అందించాలి. అటవీ శాఖ అధికారులు ప్రజలకు అండగా ఉంటారు.

– రాహుల్‌ కిషన్‌ జాదవ్‌, డీఎఫ్‌ఓ

ఉచ్చులకు బలికాకుండా చూసేందుకు ప్రయత్నాలు

2022లో ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలంలోకి వచ్చి గర్భంతో ఉన్న పులి(ఎస్‌–1) వేటగాళ్ల ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జిల్లాలోకి వచ్చిన అరుదైన జాతికి చెందిన బెంగాల్‌ టైగర్‌ ఎక్కడ వేటగాళ్ల ఉచ్చులకు బలవుతుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు ముందడుగు వేసి వేటగాళ్లగా గతంలో రికార్డుల్లో ఉన్న వారితో పాటు గ్రామాల వారీగా హెచ్చరికలు జారీ చేసినట్లుగా సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది! 1
1/2

బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది!

బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది! 2
2/2

బెంగాల్‌ టైగర్‌ వచ్చేసింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement