పరస్పర బదిలీలపై ఆశలు
కాజీపేట అర్బన్: రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ప్రభుత్వం 6 నెలల క్రితం బదిలీలు చేపట్టింది. జీరో ట్రాన్స్‌ఫర్స్ ఆర్డర్స్‌లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న జిల్లా రిజిస్ట్రార్ నుంచి అటెండర్ స్థాయి వరకు బదిలీపై వెళ్లారు. కాగా, జోన్–4లో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఏకకాలంలో బదిలీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు బదిలీ అయ్యా రు. 317 జీఓ ప్రకారం స్థానికత, స్పౌజ్ కోటా ప్రాతిపదికన తీసుకోకుండా చేపట్టిన బదిలీల్లో ఇబ్బందులు పడుతున్న అధికారులకు ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరస్పర బదిలీల కోసం కేబినెట్ సబ్ కమిటీ 292 జీఓ ఎంఎస్‌ను నవంబర్ 29న విడుదల చేసింది. దీంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో విధులు నిర్వర్తిస్తున్న అధికారులు పరస్పర బదిలీల్లో భాగంగా కోరుకున్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు ఆశగా ఎదురుచూస్తున్నారు.
వరంగల్ ఆర్వోపై కన్ను..
ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు బదిలీ అయిన సబ్‌రిజిస్ట్రార్లు వరంగల్ ఆర్వోపై కన్ను వేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. తిరిగి యథాస్థానానికి వచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఉన్నతాధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు ప్రదక్షిణ చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో జోన్–4లో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మ్యూచువల్ ట్రాన్స్‌ఫర్స్ ఫీవర్ కొనసాగుతోంది. వరంగల్ ఆర్వో కార్యాలయంలోని ఆడిట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఫణీందర్ బదిలీల్లో భాగంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ జిల్లా రిజిస్ట్రార్‌గా బాధ్యతలు చేపట్టగా, ఆడిట్ జిల్లా ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్‌గా డీఐజీ కొనసాగుతున్నారు. కాగా, ఆడిట్ జిల్లా ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
మేమే వస్తున్నాం.. మా సారే వస్తున్నాడు!
వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలోని పలువురు అధికారులతోపాటు డాక్యుమెంట్ రైటర్లు ఆడిట్ జిల్లా రిజిస్ట్రార్‌గా, సబ్ రిజిస్ట్రార్‌గా మా సారే వస్తున్నాడు.. ఇక మా హవా నడుస్తుంది అంటూ చర్చించుకుంటున్నారు. కాగా, మేమే వస్తున్నామంటూ అధికారులు సైతం సంకేతాలు పంపుతున్నట్లు కార్యాలయంలో చర్చ జరుగుతోంది.
రిజిస్ట్రేషన్ శాఖలో ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ
కోరుకున్న సబ్ రిజిస్ట్రార్
కార్యాలయానికి వెళ్లనున్న అధికారులు
జోన్–4 పరిధిలో మ్యూచువల్
ట్రాన్స్‌ఫర్ ఫీవర్
స్పౌజ్, మెడికల్ విభాగంలో బదిలీలు కూడా..
రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో పరస్పర బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 317 జీఓ నుంచి ఉపశమనం పొందేందుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈనెల 1 నుంచి 31 వరకు po2018 mutualtransfers.telangana.gov. inలోలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా స్పౌజ్, మెడికల్ విభాగ బదిలీలు చేపట్టనున్నట్లు సమాచారం. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బదిలీపై వెళ్లిన అధికారులు ఆన్‌లైన్‌లో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది. ‘నయా సాల్ నయా ఆఫీస్’ అనే చందంగా రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్‌ను కల్పించనుంది.
Comments
Please login to add a commentAdd a comment