వెంకన్నకు స్వర్ణకంకణ పురస్కారం
చిల్పూరు: మండల పరిధిలోని చిన్నపెండ్యాల గ్రామానికి చెందిన చిందుయక్షగాన కళాకారుడు గజవెళ్లి వెంకన్న స్వర్ణకంకణ పురస్కారం అందుకున్నాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఆర్యాణి సకల కళావేదిక డాక్టర్ దూడపాక శ్రీధర్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి సంక్రాంతి కళా పురస్కారాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వెంకన్న 40 ఏళ్లుగా చిందు యక్షగాన వృత్తిలో రాణిస్తూ వేలాది ప్రదర్శనలు ఇచ్చినందుకుగాను ఆయన ప్రతిభను గుర్తించి జాతీయస్థాయి అవార్డును అందజేశారు.
కబడ్డీ పోటీలకు
రేపు జిల్లా జట్టు ఎంపిక
రఘునాథపల్లి: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా తరఫున సీనియర్ పురుషుల కబడ్డీ జట్టును జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు పాలకుర్తి మండలం చెన్నూరు ఉన్నత పాఠశాలలో ఎంపిక చేయనున్నట్లు కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రోళ్ల కుమార్‌గౌడ్, ప్రధాన కార్యదర్శి తోటకూరి గట్టయ్య, కోశాధికారి ఎదునూరి ఉప్పలయ్యలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న జట్టు ఫిబ్రవరి 1నుంచి 4వ తేదీ వరకు అదిలాబాద్‌లో నిర్వహించ తలపెట్టిన 71వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొంటుందని పేర్కొన్నారు. పాల్గొనే క్రీడాకారులు వయస్సుతో సంబంధం లేకుండా 85 కేజీల లోపు బరువు ఉండాలని, క్రీడాకారులు మ్యాట్ షూస్ తప్పనిసరి వెంట తెచ్చుకోవాలని సూచించారు. వివరాలకు 9849363396, 9440412915, 7661095550 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
నిట్‌లో సైన్స్
కమ్యూనికేషన్ వర్క్‌షాప్
కాజీపేట అర్బన్: నిట్ వరంగల్‌లోని విశ్వేశ్వరయ్య స్కిల్ డెవలప్‌మెంట్ భవనంలో ఆదివారం తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్, జన విజ్ఞాన వేదిక జిల్లా కమిటీ ఆధ్వార్యాన స్కూల్ టీచర్స్‌కు ఒక్క రోజు సైన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ‘గో గ్రీన్, బ్రీత్ క్లీన్, ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ లైఫ్’ అనే అంశంపై నిట్ ప్రొఫెసర్ రామరాజు ఉపాధ్యాయులతో మాట్లాడారు. కార్యక్రమంలో నిట్ ప్రొఫెసర్ ఆంజనేయులు, రాములు, జేవీవీ కమిటీ సభ్యులు కేబీ.ధర్మప్రకాష్,కాజీపేట పురుషోత్తం, రామంచ బిక్షపతి, పరికిపండ్ల వేణు, సుమలత పాల్గొన్నారు.
పురాణం మహేశ్వరశర్మకు ఘనస్వాగతం
జనగామ: పట్టణంలోని హెడ్‌పోస్టాఫీసు ఏరియా శ్రీ సంతోషిమాత ఆలయంలో నేటి (సోమవారం) నుంచి ప్రారంభం కానున్న శ్రీ వేదవ్యాస విరచిత శ్రీ స్కాంద మహాపురాణ ప్రవచనం వినిపించేందుకు బ్రహ్మశ్రీ, ఆయుత చండీయాగకర్త పురాణం మహేశ్వరశర్మ ఆదివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ నేతృత్వంలో భక్తబృందం ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ వద్ద పురాణం మహేశ్వర శర్మకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుర్రం రథంపై స్వామిజీని శోభాయాత్రగా ఆర్టీసీ చౌరస్తా వరకు వెళ్లారు. రైల్వేస్టేషన్ మీదుగా నెహ్రూపార్కు, గాంధీ బొమ్మ నుంచి ఆర్టీసీ చౌరస్తా వరకు భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ శోభాయాత్ర నిర్వహించారు. నేటి ఉదయం గణపతి పూజ, స్వస్తివాచనము, కంకణ ధారణ, కలశ స్థాపన, వ్యాస, గ్రంథ పూజ తర్వాత ప్రవచనము ప్రారంభించనున్నట్లు శ్రీనివాసశర్మ తెలిపారు.
జేఎన్ శర్మకు
రోటరీ ఎక్స్‌లెన్స్ అవార్డు
హన్మకొండ కల్చరల్: వరంగల్‌కు చెందిన సీనియర్ రంగస్థల నటులు, పోతన విజ్ఞాన పీఠం మేనేజర్ జేఎన్ శర్మ ‘రోటరీ ఎక్స్‌లెన్స్’ అవార్డు అందుకున్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వరంగల్ ఆధ్వర్యంలో ఆదివారం క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ పూర్వ అధ్యక్షులు రమేశ్, మోహన్‌రావు నుంచి ఆయన అవార్డు అందుకున్నారు. కళారంగంలో ఉత్తమ సేవలు అందించినందుకుగాను అవార్డు లభించింది.
Comments
Please login to add a commentAdd a comment