జీఐఎస్ మాస్టర్ ప్లాన్
అమృత్ 2.0 స్కీంలో
పైలెట్ ప్రాజెక్టు కింద జనగామ
● పట్టణ విస్తీర్ణం
19.31 స్క్వేర్ కిలోమీటర్లు
● సర్వేను ప్రారంభించిన
కలెక్టర్ రిజ్వాన్ బాషా
● 1990 మాస్టర్ ప్లాన్..
2019 రివైజ్డ్ వివరాలతో
సర్వే ఆఫ్ ఇండియా బేస్ మ్యాప్
జనగామ: రాష్ట్రాలు, నగరాలను మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేయడానికి కేంద్రం అమృత్ 2.0 పథకానికి శ్రీకారం చుట్టింది. జీఐఎస్(జియోగ్రా ఫికల్ ఇన్ఫర్మెషన్ సిస్టం–రివైజ్డ్/కొత్త) ఆధారంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు దేశ వ్యాప్తంగా 20 మున్సిపాలిటీలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయగా.. అందులో జనగామ మున్సిపాలిటీ ఉంది. సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యాన 1990 సంవత్సరం చేపట్టిన మాస్టర్ ప్లాన్‌తో పాటు 2019లో రివైజ్డ్ చేసిన సమాచారం ఆధారంగా ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకుని సర్వే మొదలు పెట్టారు. జిల్లా కేంద్రం ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జీఐఎస్ సర్వేను ప్రారంభించారు.
19.31 స్క్వేర్ కిలోమీటర్లు
యశ్వంతాపూర్, చీటకోడూరు, శామీర్‌పేట ప్రాంతాల శివారు సర్వే నంబర్లు విలీనం చేయగా జిల్లా కేంద్రం 19.31 స్క్వేర్ కిలోమీటర్ల పరిధికి విస్తరించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 57వేలు ఉండగా ప్రస్తుతం 85వేలకు చేరింది. జనగామ మున్సిపాలిటీకి 1990లో మాస్టర్ ప్లాన్ తయారు చేయగా.. 2010లో రివైజ్ చేయాల్సి ఉంది. అయితే 2019లో (2041 వరకు) పట్టణ అభివృద్ధి, కనీస మౌలిక వసతి సౌకర్యాలు, ఇండస్ట్రియల్, రహదారుల విస్తరణ, రింగురోడ్ల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ సర్వేను పట్టాలెక్కించారు. కరోనా ఎఫెక్ట్‌తో ఆ ప్రక్రియకు బ్రేక్ పడగా.. ప్రస్తుతం మోక్షం లభించింది. అమృత్ 2.0 స్కీంలో పైలెట్ ప్రాజెక్టు కింద జనగా మ మున్సిపాలిటీ ఎంపిక కాగా.. సర్వే ఆఫ్ ఇండి యా సర్వేయర్ బి.గోపాల్‌రావు నేతృత్వాన జీఐఎస్ ఆధారిత మాస్టర్ ప్లాన్ తయారీకి డిజిటల్ సర్వే చేపట్టారు. పూర్తి స్థాయి మాస్టర్ ప్లాన్‌కు డిజిటల్ ద్వారా చేపట్టిన బేస్ మ్యాప్ ఉపయోగపడుతుంది.
సర్వే ప్రక్రియ ఇలా..
జనగామ పట్టణానికి సంబంధించిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, వ్యవసాయ తదితర విభాగాల సమాచారాన్ని సర్వే ఆఫ్ ఇండియా తీసుకుంది. జీఐఎస్ సర్వే కోసం 30 వార్డుల పరిధిలో 30 నుంచి 40 పాయింట్లు(గ్రౌండ్ చెకింగ్ పాయింట్లు) గుర్తించారు. ముందస్తుగా గుర్తించిన గ్రౌండ్ చెకింగ్ పాయింట్ నుంచి డ్రోన్‌ను పంపిస్తారు. డ్రోన్ ఒక్కసారి ఎగిరితే సుమారు 45 నుంచి 59 నిమిషాల పాటు త్రీడీ సిస్టంలో ముందుగా గుర్తించిన ప్రదేశంలో 1.8 సెకన్లకు ఒక ఫొటో చొప్పున 600 ఎకరాల భూమికి సంబంధించిన 3,200 ఫొటోలను క్యాప్చరింగ్ చేస్తుంది. డ్రోన్ 120 మీటర్ల ఫ్రీక్వెన్సీ ఎత్తులో మాత్రమే ప్రయాణం చేస్తుంది. వాతావరణ మార్పులు, ఈదురు గాలులు సంభవించిన సమయంలో గ్రౌండ్ చెక్ పాయింట్ వద్ద ఉన్న కంట్రోల్ రూంకు సంకేతాలు అందించిన వెంట నే.. దానిని వెనక్కి రప్పిస్తారు. పది రోజుల పాటు జీఐఎస్ సర్వే పూర్తి చేసి.. రెండు నెలల్లో హైదరాబాద్ సర్వే ఆఫ్ ఇండియాకు నివేదిక పంపిస్తారు. శాటిలైట్ ద్వారా అక్యురేట్‌గా తీసిన ఫొటోలు, తదితర వివరాలతో కూడిన హార్డు కాపీలు, మాస్టర్ ప్లాన్ కాపీలను జనగామ మున్సిపల్‌కు పంపిస్తారు. 2019 నాటి రివైజ్డ్ మాస్టర్ ప్లాన్ ఆధారంగా ప్రస్తుత జీఐఎస్ సర్వేను జోడించి పురపాలిక భవిష్యత్‌కు పునాది వేయనున్నారు. జనగామ మాస్టర్ ప్లాన్ పట్టణ అభివృద్ధికి మరింత దోహదపడనుంది. డ్రోన్ సర్వే నేపథ్యంలో సీఐ దామోదర్‌రెడ్డి, పోలీసులు బందోబస్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment