వేలం ఆదాయం రూ.14.52లక్షలు
లింగాలఘణపురం: మండలంలోని జీడికల్ వీరాచల రామచంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతీ శనివారం నిర్వహించే అంగడిలో రహదారుల వేలం ఆదాయం రూ.14.52లక్షలు వచ్చినట్లు ఈఓ వంశీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో దేవాదాయ ఇన్స్‌పెక్టర్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన వేలం పాటను రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్‌కు చెందిన కావటి రాజయ్య దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ మూర్తి, డైరెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, శ్రీశైలం, వెంకన్న తదితరులు ఉన్నారు.
మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి
నర్మెట: మహిళలు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకుని అన్నిరంగాల్లో రాణించాలని వాయిస్ ఫర్ గర్‌ల్స్ (ఎన్‌జీఓ) సంస్థ ఫీల్డ్ కోఆర్డినేటర్ మోక్ష శ్రీ అన్నారు. గిరిజనుల్లో చైతన్యం కలిగించడానికి ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రా మిశ్రా సూచనల మేరకు స్థానిక ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో సంస్థ ఆధ్వర్యంలో వారం రోజులుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కాగా మంగళవారం ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజానికి దూరంగా నివసిస్తూ విద్యకు దూరమై అవగాహన కొరవడిన గిరిజనల్లో చైతన్యం కలిగించాలన్నదే తమ ఉద్దేశ్యమన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం భూక్య కిష్ట, ఉపాధ్యాయులు సునీత, జ్యోతి, వినోద, రజని, సాంబక్క, సంస్థ ప్రతినిధులు ప్రగతి, సమ్రీన్, విద్యార్థినులు పాల్గొన్నారు.
పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
జనగామ రూరల్: ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్సీ, బ్యాంకింగ్ రిక్రూట్‌మెంట్ ఫౌండేషన్ కోర్సులకు వంద రోజుల ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షల ఆదాయం ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, డిగ్రీ పరీక్షల్లో పొందిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం ఉంటుందని స్పష్టం చేశారు. అర్హత గల అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఫిబ్రవరి 12 నుంచి 14వ తేదీ వరకు ఉంటుందని, ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మెరుగైన సేవలు
స్టేషన్‌ఘన్‌పూర్: డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో స్టేషన్‌ఘన్‌పూర్ ఏసీపీ భీమ్‌శర్మ మంగళవారం వైద్యపరీక్షలు చేసుకున్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి చేసుకునే బీపీ, షుగర్, సీబీపీ తదితర పరీక్షలను ఆయన చేయించుకున్నారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయని, వైద్యులు మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సౌఖ్య తదితరులు పాల్గొన్నారు.
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
పాలకుర్తి: కుక్కల దాడిలో చెన్నూరు గ్రామంలో 25 గొర్రెలు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. జోగు అశోక్ సోమవారం సాయంత్రం తన ఇంట్లో ఉన్న దొడ్డిలో రోజుమాదిరిగానే గొర్రెలను వదిలాడు. మంగళవారం ఉదయం చూసేసరికి ఊరకుక్కలు దొడ్డిలోని సుమారు 25 గొర్రెలపై దాడి చేయడంతో మృతి చెందాయి. వాటి విలువ రూ.3.50లక్షలు ఉంటాయన్నారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న తనకు జీవనోపాధి కోల్పోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని అశోక్ వేడుకున్నారు. అయితే గ్రామంలో కుక్కల బెడదతో ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment