వరి నాట్లు ప్రారంభం
మల్హర్: మండల వ్యాప్తంగా యాసంగి సాగు పనులు జోరందుకున్నాయి. మండలంలో 10వేల పైచిలుకు ఎకరాల్లో వరి సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. మండలంలోని తాడిచర్ల, మల్లారం, పెద్దతూండ్ల, చిన్నతూండ్ల, కొయ్యూరు, వల్లెకుంట తదితర గ్రామాల్లో రైతులు సాగు పనుల్లో బీజీ, బీజీగా గడుపుతున్నారు. సాధారణ వరి సాగుతో పాటు ఆడ, మగ వరి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. నారుమడులు ఆశాజనకంగా ఎదుగుతుండడంతో వరి నాట్లను రైతులు ప్రారంభించారు. బోర్లు, బావులు ఉన్న రైతులు ఇప్పటికే వరి నాట్లు వేస్తున్నారు. చెరువు సాగు పొలాల్లో నారుమడులు వేసి నాట్లకు సిద్ధమవుతున్నారు. పలు ప్రాంతాల్లో దమ్ము పనులు చేపడుతుండగా మహిళలు నారు సేకరణ, కట్టాలు కట్టే పనుల్లో నిమగ్నమయ్యారు. దమ్ము పూర్తయిన చోట వరినాట్లు వేస్తున్నారు. నారు ముదరక ముందే వరి నాట్లు వేసుకోవాలని వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
సకాలంలో నాట్లు వేసుకోవాలి
సకాలంలో వరి నాట్లు వేసుకోవాలి. నారు ముదురితే పంట ఎదుగుదల లోపంతో పాటు దిగుబడులు తగ్గే ప్రమాదం ఉంది. వరుస పద్ధతిలో నాట్లు వేసుకోవాలి. వరి నాట్ల సమయంలో పంట భూముల్లో నీటి నిల్వలు అధికంగా లేకుండా చూసుకోవాలి. సస్యరక్షణ చర్యల వివరాల కోసం అందుబాటులో ఉన్న వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలి.
– శ్రీజ, ఏఓ, మల్హర్
యాసంగి పనుల్లో రైతన్న నిమగ్నం
10వేల ఎకరాల్లో సాగుకానున్న వరి
Comments
Please login to add a commentAdd a comment