జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు తీసుకునే పౌష్టికాహారం, సమయానుసారంగా వైద్య పరీక్షలతోనే ప్రసవ సమయంలో ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండేందుకు అవకాశం ఉంది. గర్భందాల్చిన వెంటనే స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణుల వివరాలు నమోదు చేసుకుంటే ప్రతీ రోజు మధ్యాహ్నం పౌష్టికాహారంతో కూడిన భోజనం, గుడ్లు, పాలు అందిస్తారు. వీటిని సక్రమంగా తీసుకుంటూ టీడీ వ్యాక్సిన్లు ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తల సహాయంతో వేసుకుని వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేసుకుంటే ప్రసవ సమయానికి ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. గర్భిణిగా పేరు నమోదుకు కొందరు ఆలస్యం చేయడం, సమయానికి వైద్య పరీక్షలు చేసుకోకపోవడం, రక్తహీనత, పౌష్టికాహార లోపం వంటి కారణాలు మాతృ మరణానికి కారణమవుతున్నాయి. ఇటీవల కాలంలో జరిగిన మాతృ మరణాల్లో గుండెపోటు మరణాలు సంభవిస్తుండడంతో గర్భిణులకు స్కానింగ్‌తో పాటు 2డీ ఎకో పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. 2020నుంచి 2024 నవంబర్ వరకు జిల్లాలో 19మంది ప్రసవ సమయంలో మరణించారు. మాతాశిశు మరణాలు అరికట్టేందుకు జిల్లా కేంద్రంలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేసినా ఇప్పటికీ మాతృ మరణాలు అక్కడక్కడ సంభవిస్తుండడంపై అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ రాహుల్‌శర్మ ఇటీవల వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాతృ మరణం ఒక్కటికూడా జరగకుండా చూడాలని, ఇందుకోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment