పారదర్శకంగా ముగిసిన కౌన్సెలింగ్
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో ఖాళీగా ఉన్న సింగరేణి క్వార్టర్లకు సోమవారం పారదర్శకంగా కౌన్సెలింగ్ నిర్వహించినట్లు ఏరియా అధికార ప్రతినిధి మారుతి తెలిపారు. టీటు, ఎండీ, బ్యారెక్, రామప్ప కాలనీలలో 354 ఖాళీ క్వార్టర్లకు కౌన్సెలింగ్ నిర్వహించగా 570మంది ఉద్యోగులు హాజరుకాగా 188మంది తమకు నచ్చిన క్వార్టర్లను ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా 166 క్వార్టర్లు మిగిలినట్లు తెలిపారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కవీంద్ర, వెంకటరమణ, రవికుమార్, మురళీమోహన్, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అర్ధరాత్రి వరకు
డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు
భూపాలపల్లి అర్బన్: నేడు (డిసెంబర్ 31) వేడుకలు జరుపుకునే వారు ప్రమాదాలకు దూరంగా ఉంటూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతమైన ప్రశాంత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని సీఐ నరేష్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ఈవెంట్‌లకు డీజేలకు అనుమతులు లేవని, రోడ్లపై కేక్‌లు కట్ చేవద్దన్నారు. పట్టణంలో మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు ప్రభుత్వం అనుమతించిన సమయపాలన పాటించాలన్నారు. స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించరాదన్నారు.
సీఎంఆర్ వరంగల్
ఎనుమాములకు తరలింపు
భూపాలపల్లి రూరల్: జిల్లాకు సంబంధించిన సీఎంఆర్‌ను వరంగల్ ఎనుమాముల గోదాంలో భద్రపరచనున్నట్లు అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. సోమవారం వరంగల్ ఎనుమాముల గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖరీఫ్ 2024–25 సీజన్‌కు సంబంధించి జిల్లాకు సంబంధించిన సీఎంఆర్ బియ్యం ఇక్కడ భద్రపరచి కేటాయింపు ప్రకారం ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రాసెసింగ్ అనంతరం గోదాంలో నిల్వ చేయనున్నట్లు చెప్పారు. ధాన్యం నిల్వలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలి పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరా ల అధికారి శ్రీనాధ్, డీఎం రాములు, మిల్లర్లు పాల్గొన్నారు.
వేతనాలు విడుదల చేయాలి
భూపాలపల్లి అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వచ్ఛ పారిశుద్ధ్య కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని టీడీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో నియమితులైన స్కావెంజర్లకు ఆరు నెలల నుంచి వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి వెంటనే వేతనాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిరుపతి, సమ్మయ్య దేవేంద్ర పాల్గొన్నారు.
ప్రత్యేక అలంకరణలో
గణపేశ్వరుడు
గణపురం: మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం గణపేశ్వరాలయంలో సోమవారం సోమవతి అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవతి అమావాస్య పర్వదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం గణపతి పూజ అనంతరం స్వామి వారికి, నందీశ్వరుడికి పంచమృతాలతో ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం గణపేశ్వరస్వామి వారితో పాటు భవాని మాతను నూతన పట్టువస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment