ఎండిన వనంలో ఔషధ మొక్కలు
కాటారం: నూతన సంవత్సరం వేళ ప్రకృతి ప్రేమికులు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్ తరాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔషధ మొక్కలు నాటి ప్రకృతిపై తమ ప్రేమను చాటుకున్నారు. మహాముత్తారం మండల కేంద్రంలో 2021లో అటవీశాఖ అధికారులు ప్రభుత్వ స్థలంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పల్లెప్రకృతి వనం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పలు రకాల మొక్కలు నాటి వదిలేశారు. మూడేళ్లుగా సంరక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రకృతివనంలో మొక్కలు ఎండిపోయి మోడులుగా మారాయి. దీంతో మండలానికి చెందిన పలువురు వన ప్రేమికులు ప్రకృతివనంలో తిరిగి మొక్కలు నాటాలనే ఆలోచనకు వచ్చారు. పలువురు దాతలు, గ్రామస్తుల సహకారంతో ఔషధ మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు బుధవారం ప్రకృతి ప్రేమికులు, యువకులు, గ్రామానికి చెందిన పలువురు కలిసి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉండే రావి, వేప, ఉసిరి, మారేడు, నేరేడు, జమ్మి, మర్రి, పనస, ఎలక, అల్లనేరేడు, పాల, మోదుగ, మామిడి, ఇతర ఔషధ మొక్కలను నాటారు. వీటి సంరక్షణ చర్యలు చేపట్టడం కోసం ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి నాటిన మొక్కలు నిర్వీర్యం కాగా ప్రకృతి ప్రేమికులు విరాళాల ద్వారా మొక్కలు నాటడం పలువురిని ఆలోచింపజేస్తుంది. వీరి ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో బానోతు రాజునాయక్, అజ్మీర డాకునాయక్, పెరుమాండ్ల సురేశ్, చంద్రగిరి రవి, రంగు శ్రీనివాస్, ఆలోత్ ప్రతాప్ పాల్గొని మొక్కల పెంపకం బాధ్యతను తీసుకున్నారు.
దాతల సహకారంతో
మొక్కలు నాటిన వన ప్రేమికులు
Comments
Please login to add a commentAdd a comment