పుష్కరాలకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం
భూపాలపల్లి: కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాలకు విచ్చేసే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు మాస్టర్ ప్రణాళిక సిద్ధంచేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో సరస్వతి పుష్కరాల నిర్వహణపై దేవాదాయ, పంచాయతీరాజ్, సమాచార, రెవెన్యూ, విద్యుత్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పుష్కరాల సందర్భంగా భక్తులు ఇబ్బందులు పడకుండా సమస్యలు నివారించేందుకు అన్ని విభాగాల అధికారుల సమన్వయం కీలకమని అన్నారు. ఏర్పాట్ల సమాచారం భక్తులు సులభంగా తెలుసుకోవడానికి వీలుగా మ్యాపింగ్ తయారు చేయాలన్నారు. పుష్కరఘాట్ల వద్ద పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేకంగా పారిశుద్ధ్య సిబ్బందిని, ట్రాక్టర్లు ఏర్పాటు చేయాలని డీపీఓకు సూచించారు. తాగునీరు, మరుగుదొడ్లు గుర్తించడానికి వీలుగా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీటి నిల్వలు, శౌచాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. వేసవి దృష్ట్యా విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సరస్వతి పుష్కరాల ప్రాధాన్యాన్ని భక్తులకు తెలియజేయడానికి సమాచార శాఖ ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. రవాణా శాఖ ప్రత్యేక బస్సులు నిర్వహించి, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీపీఓ నారాయణరావు, పౌర సంబంధాల శాఖ అధికారి శీలం శ్రీనివాస్, ఎస్‌ఈ మల్చూర్‌నాయక్ పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బంది రానివ్వొద్దు
కలెక్టర్ రాహుల్‌శర్మ
ఫిర్యాదులపై తక్షణ చర్యలు
భూపాలపల్లి: ప్రజావాణిలో ప్రజలు అందజేసిన ఫిర్యాదుల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ వినతులు స్వీకరించారు. ఈ ప్రజావాణిలో 25 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ మంగీలాల్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment