పారామీటర్ల నమోదులో జాగ్రత్తలు
భూపాలపల్లి: యాస్పిరేషన్ పారామీటర్ల నమోదులో జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు సోమవారం కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఐడీఓసీ కార్యాలయంలో విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యాన, సంక్షేమ, డీఆర్‌డీఏ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పౌసమి బసు మాట్లాడుతూ.. నీతి ఆయోగ్ భూపాలపల్లిని యాస్పిరేషన్ జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు పారామీటర్ల నమోదులో వ్యత్యాసం రాకుండా పకడ్బందీగా నమోదు చేయాలని సూచించారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి డేటా ఖచ్చితత్వం అవసరమని చెప్పారు. అందుకు సంబంధిత అధికారులు నిర్లక్ష్యం లేకుండా పనిచేయాలని సూచించారు. నీతి ఆయోగ్ నుంచి అందే మార్గదర్శకాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి భూమికి అనుగుణంగా పంటల సాగు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. తీవ్ర, అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు గ్రూప్ డిస్కస్ నిర్వహించాలని చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్, డీఆర్‌డీఓ నరేష్, డీఈఓ రాజేందర్ పాల్గొన్నారు.
చిరు ధాన్యాలతో ఎంతో మేలు
గణపురం: ప్రస్తుత జీవన విధానంలో చిరు ధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వలన ప్రజలు ఎంతో ఆరోగ్యంగా, శక్తివంతంగా జీవిస్తారని నీతి అయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు అన్నారు. చెల్పూరులో మహిళా స్వయం సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె సందర్శించారు. మిల్లెట్స్‌తో చేసిన ఆహారం తిని చాలా బాగుందని అభినందించారు. పలు రకాల మిల్లెట్ ప్యాకెట్స్‌ను కొనుగోలు చేశారు. అనంతరం గణపురం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, సీపీఓ బాబురావు, డీఎంహెచ్‌ఓ మధుసూదన్, డీఆర్‌డీఓ నరేష్, డీఈఓ రాజేందర్, సంక్షేమ అధికారి చిన్నయ్య, వ్యవసాయాధికారి విజయ్‌భాస్కర్ పాల్గొన్నారు.
నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు
Comments
Please login to add a commentAdd a comment