సావిత్రిబాయి పూలే ఆదర్శం
భూపాలపల్లి: సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకొని ఉపాధ్యాయులు ఉన్నత విద్యను అందించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే, కలెక్టర్ రాహుల్ శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళల చదువు కోసం కృషిచేసిన గొప్ప వ్యక్తి సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. మహిళల జీవితాల్లో గొప్ప మార్పు తెచ్చారని, నేడు దాదాపు 50శాతంపైగా మహిళలు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఆనాడే మహిళా విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప వ్యక్తి సావిత్రి బాబు పూలే అని అన్నారు. మహిళల పట్ల వివక్ష ఉన్న రోజుల్లో విద్య ప్రాధాన్యతను గుర్తించి మహిళల కోసం ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసిన మహానుభావురాలని కొనియాడారు. అనంతరం ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను శాలువా, మెమొంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళా ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ మహిళా ఉపాధ్యాయులు వీరే..
టి.శాంత (జెడ్పీహెచ్‌ఎస్, పెద్దాపూర్), బి.సరళ (జెడ్పీహెచ్‌ఎస్, చిట్యాల), పద్మరేఖ (ఎంపీపీఎస్, చెల్పూర్), ఆర్.లలిత (ఎంపీయూపీఎస్, చెన్నాపూర్), జె.ఉమారాణి (జెడ్పీహెచ్‌ఎస్, కాటారం), ఎస్.చంద్రకళ (జెడ్పీహెచ్‌ఎస్, ములుగుపల్లి), బి.అన్నపూర్ణ (జెడ్పీహెచ్‌ఎస్, కాళేశ్వరం), డి.సంధ్యారాణి(ఎంపీపీఎస్, ఎడ్లపల్లి), డి.ఉమారాణి (జెడ్పీహెచ్‌ఎస్, మొట్లపల్లి), ఆర్.ఉమారాణి (ఎంపీపీఎస్, లెంకలగడ్డ), వనేంద్రమణి (ఎంపీపీఎస్, రంగయ్యపల్లి), ఎస్.కవిత (జెడ్పీహెచ్‌ఎస్, టేకుమట్ల) ఉత్తమ మహిళా ఉపాధ్యాయినిలను ఎంపిక చేసి సత్కరించారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment