‘సహకార’ పునర్విభజన
భూపాలపల్లి రూరల్: జిల్లాల పునర్విభజన తర్వాత కొత్తగా టేకుమట్ల, పలిమెల, ఇటీవల కొత్తపల్లి(గోరి) కొత్త మండలాలుగా ఏర్పాటైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయా మండలాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు మాత్రం ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం ఈ మండలాల రైతులు పాత మండలాల పీఏసీఎస్‌లకు వెళ్లి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు తీసుకొని రావడానికి కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మండలాల్లో పీఏసీఎస్ ఏర్పడితే వారికి ఈ వ్యయప్రయాసలు తొలిగే అవకాశం ఉంది. నూతన మండలాలతోపాటు పలుచోట్ల వెసులుబాటును పరిశీలించిన కోఆపరేటీవ్ అధికారులు జిల్లాలో కొత్తగా పలు పీఏసీఎస్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు.
కోఆపరేటివ్ శాఖ పరిధిలోకి వచ్చే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ల పునర్విభజన చోటు చేసుకుంటుంది. కొత్త మండలాల్లో సంఘాల ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదనలు ఆ శాఖ కమిషనర్ కార్యాలయానికి చేరాయి. జిల్లాల వారీగా వివరాలను అధికారులు ఆన్‌లైన్ ద్వారా అందజేశారు. అందులో ఎన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. వేచి చూడాలి.
సాధ్యసాధ్యాల పరిశీలన
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ కమిషనర్ అండ్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటీవ్ సొసైటీస్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రధానంగా కొత్త మండలాలు ఏర్పాటైన నేపథ్యంలో నిబంధనల మేరకు అక్కడ పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని కోరింది. ఒక్కో పీఎసీఎస్ పరిధిలో కనీసం 300 నుంచి 500వరకు రైతులకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు కలిగి ఉండాలి. అలాగే అక్కడ పీఏసీఎస్ ఏర్పాటు చేస్తే బిజినెస్ నడుస్తుందా.. ఆర్థికంగా సొసైటీ నిలదొక్కుకోగలుగుతుందా... ఇలాంటి 47 అంశాలను పరిశీలించాలని సూచించింది. దానికి అనుగుణంగా డీసీఓలు వాటిని పరిగణలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించి ఆ వివరాలను ఆన్‌లైన్ ద్వారా అందజేశారు.
ప్రతిపాదనలు పంపించాం
నూతన పీఏసీఎస్‌లకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించాం. అందులో ఎన్నిటికి ఆమోదం లభిస్తుందో ఇప్పుడే చెప్పలేం. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఉన్న పీఏసీఎస్‌ల పరిధిలో కొన్ని గ్రామాలను విభజించి కొత్త సొసైటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాం.
– వాల్యానాయక్, డీసీఓ
జిల్లాలో పీఏసీఎస్‌లు ఇలా..
పాత పీఏసీఎస్‌లు పీఏసీఎస్
ప్రతిపాదిత ప్రాంతాలు
1) భూపాలపల్లి జంగేడు, పంబాపూర్
2) మల్హర్ తాడిచర్ల కొయ్యూరు
3) మహదేవ్‌పూర్ పలిమెల
4) మహాముత్తారం బోర్లగూడెం
5) మొగుళ్లపల్లి మొట్లపల్లి
6) చిట్యాల టేకుమట్ల, ఒడితెల
7) రేగొండ కొత్తపల్లి (గోరి)
8) కాటారం దామెర కుంట
9) గణఫురం
10) చెల్పూరు
కొత్త మండలాలతో పాటు ప్రతిపాదిత ప్రాంతాల్లో ఏర్పాటు
ప్రతిపాదనలు పంపిన సంబంధిత అధికారులు
సభ్యుల నుంచి తీర్మానాల సేకరణ
పరిశీలన తర్వాత
గ్రీన్ సిగ్నల్‌కు అవకాశం
ప్రయోజనాలు..
కొత్త పీఏసీఎస్‌లు ఏర్పడితే కొన్ని గ్రామాలకు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు తదితర సొసైటీ నుంచి కొనుగోలు చేసేందుకు దూరభారం, ఆర్థిక భారం తగ్గుతుంది. సొసైటీకి అనుబంధంగా కోఆపరేటివ్ బ్యాంక్ కూడా ఏర్పడుతుంది. ఆ బ్యాంక్ పరిధిలో రైతులు రుణాలను సులువుగా పొందేందుకు ఆస్కారం ఉంటుంది. అంతే కాకుండా ఒక పీఏసీఎస్ ఏర్పడితే దానికి సంబంధించి పాలకవర్గం కూడా ఏర్పాటవుతుంది. అందులో 13 మంది సభ్యులు ఉంటారు. తద్వారా దాని పరిధిలోకి వచ్చే గ్రామాల వారికి రాజకీయంగా కూడా ఒక హోదా పొందేందుకు అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పటివరకు జిల్లాలోని 10 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉమ్మడి వరంగల్ డీసీసీబీ పరిధిలోనే కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మరో 9 పీఏసీఎస్‌లు ఏర్పాటు చేయాలని సభ్యులు తీర్మానం చేసిపంపినట్లుగా సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment