జాతర పనులు త్వరగా పూర్తిచేయాలి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ మినీ జాతర పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. మండల పరిధిలోని మేడారంలో కలెక్టర్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. దేవాదాయశాఖ క్యూలైన్, జంపన్నవాగు వద్ద స్నాన ఘట్టాలు, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మినీ మేడారం జాతరను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంలో పారిశుద్ధ్యం లోపించకుండా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రపరచాలని సూచించారు. భక్తులు క్యూలైన్‌లో గద్దెల ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తోపులాట జరగకుండా చూసుకోవాలన్నారు. అక్కడ తాగునీరు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని, గద్దెల ప్రాంతంతో పాటు పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. జంపన్న వాగు ప్రాంతంలో పుణ్య స్థానాలు ఆచరించిన అనంతరం మహిళలు దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేయాలని, మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలని సూచించారు. నాలుగు రోజుల పాటు జరిగే మినీ మేడారం జాతరకు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట డీపీఓ దేవరాజ్, ఎంపీడీఓ సుమనవాణి, పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment