పకడ్బందీగా సర్వే
కాటారం: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కోసం సర్వే పకడ్బందీగా చేపట్టాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ సూచించారు. కాటారం మండలకేంద్రంలోని సబ్‌స్టేషన్‌పల్లిలో అధికారులు చేపడుతున్న సర్వేను సబ్‌కలెక్టర్ పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న తీరుపై ఆరాతీశారు. సర్వే బృందాలు పారదర్శకతతో వ్యవహరిస్తూ పూర్తిస్థాయిలో సమాచారం సేకరించాలని ఆదేశించారు. అవకతవకలకు చోటివ్వకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా అధికారులు కృషిచేయాలన్నారు. లబ్ధిదారులు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మండల అధికారులను సంప్రదించాలని, అర్హులైన వారికి పథకాలు అందుతాయని.. ఆందోళన చెందవద్దన్నారు. సబ్ కలెక్టర్ వెంట తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ బాబు, నాయబ్ తహసీల్దార్ రామ్మోహన్, ఆర్‌ఐ వెంకన్న, ఎంపీఓ వీరస్వామి, పంచాయతీ కార్యదర్శి షగీర్‌ఖాన్, ఏఈఓ సరిత ఉన్నారు.
అర్హులకు న్యాయం జరిగేలా చూడాలి..
ప్రభుత్వ పథకాల అమలులో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వం అమలు చేయనున్న నాలుగు పథకాలపై మహాముత్తారం మండలకేంద్రంతో పాటు బోర్లగూడెంలో కొనసాగుతున్న సర్వేను అదనపు కలెక్టర్ పరిశీలించారు. సర్వే కొనసాగుతున్న తీరుపై ఆరాతీసి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం మహాముత్తారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో పథకాల సర్వేపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి లబ్ధి జరిగేలా పకడ్బందీగా సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు.
కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్
Comments
Please login to add a commentAdd a comment