పులకించిన మల్లూరు
మంగపేట: మండలంలోని మల్లూరులో సంక్రాంతిని పురస్కరించుకుని శ్రీ హేమాచల లక్ష్మీనృసింహస్వామి వరపూజ మహోత్సవం మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రావణం సత్యనారాయణ పర్యవేక్షణలో లక్ష్మీనృసింహస్వామి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు వరపూజ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గ్రామంలోని రామాలయం ఎదుట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో మూడు గంటల పాటు కొనసాగిన ఈ మహోత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. జయజయద్వానాలతో మల్లూరు పులకించింది. స్వామివారికి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి తీసుకొచ్చిన పట్టు వస్త్రాలను కార్యనిర్వహణ అధికారి శ్రావణం సత్యనారాయణ, ప్రధానార్యకులు రాఘవాచార్యులు దేవతా మూర్తుల తరఫున శ్రీ మల్లూరు శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయ పూజారి అనిపెద్ది నాగేశ్వర్‌రావు పెద్దలుగా వ్యవహరించి స్వామికి, అమ్మవార్లకు నూతన పట్టు వస్త్రాలను అందజేశారు. ప్రతీ ఏటా హేమాచల క్షేత్రంలో నిర్వహించే స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని మే 12న నిర్వహించేందుకు ముహూర్తాన్ని ఖరారు చేశారు. భక్తులు అర్ధరాత్రి తర్వాత కూడా స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.
కాంతులీనిన మల్లూరు
జాతరకు తరలివచ్చిన భక్తులు స్వామివారి వరపూజా మహోత్సవాన్ని తిలకించేందుకు ఇబ్బంది పడకుండా అధికారులు ప్రత్యేకంగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. స్వామివారి వరపూజా మహోత్సవ మండపం నుంచి బొడ్రాయి సెంటర్ వరకు జాతర జరిగే రోడ్లకు ఇరువైపులా రంగుల లైట్లతో అలంకరించారు. స్వామివారి వరపూజా మహోత్సవం మంగళవారం రాత్రితో ముగిసినప్పటికీ బుధవారం సాయంత్రం వరకు జాతర కొనసాగుతూనే ఉంది. కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులు గా హాజరైన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మంత్రి సీతక్క తనయుడు ధనసరి సూర్యను అర్చకులు సన్మానించారు. స్వామవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏటూరునాగారం సీఐ అనుముల శ్రీనివాస్ పర్యవేక్షణలో ఎస్సై టీవీఆర్ సూరి పోలీస్ సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు నిర్వహించారు. జయరాంరెడ్డి, యానయ్య, శ్రీనివాస్, సురేశ్ పాల్గొన్నారు. మల్లూరుగుట్టపై ఉన్న హేమాచల క్షేత్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని స్వయంభుగా వెలిసిన స్వామివారికి ఆలయ అర్చకులు కై కర్యం రాఘవాచార్యులు, ముక్కామల శేఖర్ శర్మ, కారంపుడి పవన్‌కుమార్ ఆచార్యులు తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు.
వైభవంగా హేమాచలుని
వరపూజా మహోత్సవం
కొనసాగుతున్న జాతర
Comments
Please login to add a commentAdd a comment