మోడల్‌హౌస్
కాళేశ్వరం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రతీ మండలకేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ (నమూనా ఇల్లు) నిర్మించాలని నిర్ణయించింది. మండల పరిషత్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఇంటిని నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించగా జిల్లాలోని పలిమెల మండలం కాకుండా మొత్తం మండలాల్లో మోడల్‌హౌస్‌ల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది.
లబ్ధిదారులకు అవగాహన..
రాష్ట్ర ప్రభుత్వం మంజూరుచేస్తున్న ఐదు లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం పూర్తవుతుందా అనే సందేహం ప్రజల్లో నెలకొంది. దీనిని నివృత్తి చేయడానికి ప్రభుత్వం రూ.5 లక్షలతో ఇంటి నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. నమూనా ఇంటి నిర్మాణానికి ముగ్గుపోసిన రోజు నుంచి కేవలం 20రోజుల్లో అన్ని హంగులతో ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేస్తామని గృహ నిర్మాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇంటి నిర్మాణ కొలతలను అధికారులు నిర్ధారించారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. రెండు తలుపులు, రెండు కిటీకీలు, ఒక వెంటిలేటర్ ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.
రేగొండలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ఈనెల 8న రేగొండలో మోడల్ హౌస్ నిర్మాణానికి ఽశంస్థాపన చేశారు. గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. మొగుళ్లపల్లి, గణపురం, టేకుమట్ల, చిట్యాల, భూపాలపల్లిలో స్థలాలు ఎంపిక చేశారు.
ఇంటినిర్మాణ కొలతలు ఇలా..
మొత్తం 400 చదరపు అడుగుల విస్తీర్ణం
హాలు: 9.0x10.10
వంటగది: 6.9x10.0
బెడ్ రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్: 12.5x10.5
ఎంపీడీఓ కార్యాలయాల్లో ఇందిరమ్మ నమూనా ఇళ్ల నిర్మాణం
మండలకేంద్రాల్లో ఇళ్ల ఏర్పాటుకు శ్రీకారం
ఇప్పటికే రేగొండలో శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గండ్ర
కాటారం సబ్ డివిజన్‌లో
త్వరలో శంకుస్థాపన చేయడానికి ఏర్పాట్లు
త్వరగా పూర్తిచేసేందుకు అధికారుల కసరత్తు
97శాతం పూర్తయిన సర్వే..
ప్రభుత్వం నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసింది. ప్రజాపాలనలో ఇళ్లు కావాలని 1,23,419 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుంది. ఇంకా 3,761 దరఖాస్తులు సర్వే చేయాల్సి ఉంది. ఇందులో సొంత స్థలం ఎంత మందికి ఉంది. ఇందిరమ్మ గృహానికి అర్హులేనా కాదా అనేది పంచాయతీ కార్యదర్శులు సర్వే నిర్వహిస్తూ మొబైల్ యాప్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేస్తున్నారు. జిల్లాలో 97శాతం సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ఈనెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
మంత్రి శ్రీధర్‌బాబు
చేతుల మీదుగా..
మంథని నియోజకవర్గం కాటారం సబ్‌డివిజన్‌లోని మహదేవపూర్, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో స్థలాలు ఎంపిక చేశారు. పలిమెల మండలంలో స్థలంలేక నిర్మాణం ఎంపిక కాలేదు. కాటారంలో మంత్రి శ్రీధర్‌బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మోడల్ ఇళ్లు త్వరగా పూర్తిచేస్తాం..
జిల్లాలో ఇందిరమ్మ నమూనా ఇళ్లను నిర్మించనున్నాం. రేగొండలో ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి శంకుస్థాపన చేశాం. పలిమెల మండలంలో స్థలంలేక ఎంపిక చేయలేదు. త్వరలో కాటారంలో మంత్రితో శంకుస్థాపన చేయనున్నాం. మిగిలిన మండలాల్లో కూడా నమూనా ఇళ్లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మండలకేంద్రాల్లోని అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో మోడల్ హౌస్‌లను నిర్మిస్తున్నాం.
– లోకిలాల్, హౌసింగ్ పీడీ
Comments
Please login to add a commentAdd a comment