ప్లాట్లు అందేనా..
నూతనంగా ఏర్పాటుచేసిన ఆర్‌అండ్‌ఆర్ కాలనీ
మల్హర్: ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందక భూ నిర్వాసితులు రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు. జెన్‌కో, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. తమ ప్రాంత అభివృద్ధి కోసం ఇళ్లు, జాగలను వదిలి దిక్కులేని వారిలాగా సొంత ఊళ్లోనే పరాయివారుగా నివసించాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మల్హర్ మండలం తాడిచర్ల బ్లాకు–1 ఓపెన్‌కాస్ట్ విస్తరణలో భాగంగా తాడిచర్ల గ్రామం ఎస్సీకాలనీలో 49 పైచిలుకు, కాపురం గ్రామంలో 136 ఇండ్లను జెన్‌కో సేకరించింది. సేకరించిన ఇళ్లకు పరిహారం సైతం చెల్లించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో కేటాయింపులో భాగంగా తాడిచర్ల గ్రామం ఎస్సీకాలనీలో 69మంది, కాపురం గ్రా మంలో 202మంది లబ్ధిదారులను గుర్తించారు. వీరిలో కొందరికి పరిహారంతో పాటు ప్లాట్లను కేటాయించారు. మరికొంతమందికి మాత్రం పరిహారం అందజేసి ప్లాట్లు కేటాయించలేదు.
134మందికే నివాస స్థలాలు..
తాడిచర్ల బ్లాక్–1లో మొత్తం 271మందిని లబ్ధిదారులుగా గుర్తించారు. ఇందులో తాడిచర్ల ఎస్సీ కాలనీలో 69మంది, కాపురంలో 202మందిని పీడీఎఫ్ లబ్ధిదారులు ఉన్నారు. ఇప్పటి వరకు ఎస్సీ కాలనీవాసులకు 69మందికి, కాపురంలోని 65మందికి మొత్తం 134మందికి మాత్రమే రెండు విడుతలగా ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇంకా కాపురం గ్రామంలోని 137మందికి ఇళ్ల స్థలాలను కేటాయించాల్సి ఉండగా పెండింగ్‌లోనే ఉన్నాయి. రెండేళ్లుగా స్థలా లను కేటాయించాలని నిర్వాసితులు కోరినా పలు కారణాలతో నెట్టుకుంటూ వస్తున్నారు. తాడిచర్ల చుట్టుపక్కల ఈ ప్యాకేజీకి అవసరమైన భూమి అందుబాటులో లేకపోవడంతోనే ఇబ్బంది ఎదురవుతుందని సదరు అధికారులు పేర్కొంటున్నారు. గతంలో 8ఎకరాలకు పైగా ప్రైవేట్ భూమి కొనుగోలు చేసి నిర్వాసితులకు ప్లాట్లు ఇ వ్వాలని చూసినా అది కార్యరూపం దాల్చలేదు.
భూమి కన్నా.. పరిహారం మిన్న..
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలో పెండింగ్‌లో ఉన్న 137మంది తమకు నివాస స్థలాలకు బదులు అంతమేర పరిహారం నగదు రూపంలో చెల్లించాలని కోరుతున్నారు. ఇప్పటికే చాలామంది నిర్వాసితులు ఆర్‌అండ్‌ఆర్ ద్వారా వచ్చిన డబ్బులతో వివిధ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసుకున్నారు. స్థిర నివాసం ఏర్పరుచుకునేందుకు సిద్ధమయ్యారు. గతంలో సైతం తమకు ఇళ్ల స్థలాలకు బదులు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని గతంలో ఆర్డీఓకు వినతిపత్రాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. తమ సమస్యలు దృష్టిలో ఉంచుకుని నగదు రూపంలో ఓ పరిహారం అందేలా చూడాలని నిర్వాసితులు కోరుతున్నారు.
న్యాయం చేయాలి
ఓపెన్‌కాస్ట్‌లో ఇళ్లు కోల్పోయిన మాకు అధికారులు న్యాయం చేయాలి. సంవత్సరాలు గడుస్తున్నా ప్లాట్లకు సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ప్లాట్లు ఇవ్వకుండా పరిహారం ఇవ్వాలని గతంలో 30మందికి ఆర్డీఓకు వినతి పత్రాలు ఇచ్చాం. జిల్లా అధికారులు స్పందించి తమకు సత్వర న్యాయం చేయాలి
– గుమ్మడి రవి, తాడిచర్ల, మల్హర్
డబ్బులు ఇవ్వాలి
కాపురం గ్రామంలో ఇళ్లు కోల్పోయాను. ఇండ్లకు డబ్బులు, ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద పరిహారం చెల్లించారు. సంవత్సరాలు గడుస్తున్నా ప్లాట్ మాత్రం కేటాయించలేదు. అప్పటి కలెక్టర్ ప్లాట్‌కు బదులుగా డబ్బులు ఇస్తామని చెప్పడంతో ఇతర చోట స్థలం తీసుకున్నాను. అధికారులు ప్లాట్‌కు బదులుగా డబ్బులు ఇవ్వాలి.
– ముడతనపల్లి సంపత్, తాడిచర్ల, మల్హర్
●
సబ్ డివిజన్ కార్యాలయానికి పంపిస్తాం..
కాటారం సబ్ డివిజన్‌కు సంబంధించిన భూసేకరణ ఫైళ్లను నూతన ఏర్పడిన కాటారం సబ్ కలెక్టర్(సబ్ డివిజన్) కార్యాలయానికి పంపిస్తాం. మల్హర్ మండలం తాడిచర్ల, కాపురం గ్రామాలు భూ సేకరణకు పెండింగ్ భూసేకరణకు సంబంధించని పనులు అక్కడి నుంచి జరుగుతాయి.
– రవి, భూపాలపల్లి ఆర్డీఓ
రెండేళ్లుగా ఎదురుచూపులే..
పట్టించుకోని జెన్‌కో,
రెవెన్యూ అధికారులు
ఇబ్బందులు పడుతున్న నిర్వాసితులు
Comments
Please login to add a commentAdd a comment