గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలి
భూపాలపల్లి రూరల్: గ్రామసభలను విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గ్రామసభలు నిర్వహణపై సోమవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి మండల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్, గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మొదటిదశలో క్షేత్రస్థాయి విచారణ సజావుగా, సక్రమంగా చేశారని అదే స్ఫూర్తితో గ్రామసభలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగిన క్షేత్రస్థాయి విచారణలో భాగస్వాములైన అధికారులను, సిబ్బందిని అభినందించారు. 21నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీలను భాగస్వాములను చేయాలని ముందస్తు సమాచారం అందించి ఆహ్వానించాలని సూచించారు. గ్రామసభల ప్రారంభానికి ముందు ప్రభుత్వం నుంచి వచ్చిన సందేశాన్ని చదివి వినిపించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు, భూపాలపల్లి మున్సిపాలిటీతో సహా 72 గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామసభలు నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డీఆర్‌డీఓ నరేష్, డీపీఓ నారాయణరావు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు
టేకుమట్ల: నేటి (మంగళవారం) నుంచి ఈ నెల 24వరకు షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. మండలంలోని ఆశిరెడ్డిపల్లి, పంగిడిపల్లిలో నేడు జరుగనున్న గ్రామసభల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామసభల నిర్వహణ సమాచారాన్ని గ్రామస్తులందరికీ తెలిసేలా దండోరా వేయించాలని సూచించారు. ప్రభుత్వం అర్హులందరికీ రేషన్‌కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాగుకు యోగ్యం కాని భూముల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారని, ఆ భూముల వివరాలను గ్రామ సభల్లో వెల్లడిస్తారని చెప్పారు. నూతన రేషన్ కార్డుల కోసం గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రేషన్ కార్డుల జారీ నిరంతరం ప్రక్రియ అని చెప్పారు. అనంతరం గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణానికి సేకరించిన భూములను పరిశీలించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీఓ అనిత, ఆర్‌ఐ సంతోష్‌కుమార్, ఎంపీఓ సురేష్ పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రాహుల్‌శర్మ
Comments
Please login to add a commentAdd a comment