లెక్క పక్కాగా..
జిల్లాలో కొనసాగుతున్న పశుగణన
కాటారం: జిల్లాలో పశుజాతుల లెక్కింపు ప్రక్రియ పక్కాగా కొనసాగుతోంది. పశువైద్య సిబ్బంది ఇంటింటా తిరిగి ఆయా జాతులకు సంబంధించిన పశువుల వివరాలను నమోదు చేస్తున్నారు. పశుజాతులకు సంబంధించిన సంక్షేమ పథకాల రూపకల్పన చేయడంతో పాటు పశుపోషకుల ఆర్థిక పరిపుష్టిని అంచనా వేసేందుకు పశుగణన ఉపయోగకరంగా ఉంటుంది. దీని కోసం ప్రతి ఐదు సంవత్సరాల కు ఒకసారి ప్రభుత్వ ఆదేశాలతో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పట్టణాలు, గ్రామాల్లో పశుజాతుల లెక్కింపు చేపడుతున్నారు. 2018–19 సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఐదేళ్లు పూర్తి కావడంతో రెండు నెలల క్రితం పశుగుణన సర్వే ప్రారంభించారు. జిల్లాలో 12 మండలాలు ఉండగా 241 గ్రామపంచాయతీల్లో పశుగుణన కొనసాగుతోంది. ఇప్పటివరకు 70శాతం మేర పశువుల లెక్కింపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 28లోపు పశుగణన పూర్తిచేయాలని ప్రభుత్వం గడువు విధించగా నిర్దేశిత సమయంలోగా జిల్లాలో లక్ష్యం పూర్తి చేయాలనే ఉద్దేశంతో పశువైద్యశాఖ అధికారులు, సిబ్బంది ముందుకెళ్తున్నారు.
61మంది ఎన్యుమరేటర్లు..
జిల్లాలో అక్టోబర్ 25న పశుగణన సర్వే ప్రారంభమవగా 61మంది ఎన్యుమరేటర్లు ఇంటింటా తిరిగి పశువుల లెక్కింపు చేపడుతున్నారు. పశుగణన సర్వే పర్యవేక్షణ కోసం 10మంది సూపర్‌వైజర్లు, జిల్లాస్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతుండగా ఎప్పటికప్పుడు వివరాలను రాష్ట్రస్థాయి అధికారులకు అందజేస్తున్నారు. పశువైద్యశాఖలో సిబ్బంది కొరత ఉండగా గోపాలమిత్రల సహాయం తీసుకొని సర్వేను ముందుకు నడిపిస్తున్నారు.
పశుధన్ యాప్‌లో నమోదు..
పశుగణన 1919వ సంవత్సరంలో ప్రారంభమవగా ప్రతీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పశుగణన లెక్కిస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు 20సార్లు పశుగణన చేపట్టారు. మునుపెన్నడు లేని విధంగా తొలిసారి పశుగణన ఆన్‌లైన్ ద్వారా చేపడుతున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన పశుధన్ అనే యాప్ ద్వారా 16 పశుజాతులకు సంబంధించిన వివరాలను ఎన్యూమరేటర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఆవులు, ఎద్దులు, గేదె జాతి పశువులు, గొర్రెలు, మేకలు, పందులు, గుర్రాలు, గాడిదలు, కుక్కలు, పెంపుడు కుక్కలు, ఒంటెలు, పొట్టి గుర్రాలు, కుందేళ్లు, ఏనుగులు, కోళ్ల రకాలను లెక్కిస్తున్నారు. పశుపోషణలో ఉన్న రైతులు, కుటుంబాల వివరాలను సేకరించడంతో పాటు పశువుల వయసు సైతం సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి స్టిక్కరింగ్ చేస్తున్నారు.
●
నిర్ణీత గడువులోగా లెక్కింపు పూర్తి..
జిల్లాలో రెండు నెలలుగా పశుగణన కొనసాగుతోంది. ఎన్యూమరేటర్లు ఇంటింటా తిరిగి 16 రకాల పశుజాతులకు సంబంధించిన వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ప్రతీ అంశాన్ని పక్కాగా ఆన్‌లైన్‌లో నమోదుచేసి పారదర్శకంగా సర్వే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 70శాతం మేర పశుగణన పూర్తయింది. ప్రభుత్వం విధించిన గడువులోగా పశుగణన పూర్తి చేస్తాం.
– కుమారస్వామి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి
జిల్లా సమాచారం..
ఇప్పటివరకు 70శాతం మేర పూర్తి
ఫిబ్రవరి 28లోపు పూర్తయ్యే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment