జాగ్రత్తలు తప్పనిసరి | Sakshi
Sakshi News home page

జాగ్రత్తలు తప్పనిసరి

Published Fri, Apr 19 2024 1:45 AM

- - Sakshi

వేసవిలో

మానవపాడు: వేసవి ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని, వడదెబ్బ భారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జ్‌ జిల్లా వైద్యాధికారి శశికళ అన్నారు. గురువారం మండలకేంద్రంలో వైద్యసిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసరమైతేనే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం వరకు బయటకు రావొద్దని, పిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని, సరిపడా నీరు తాగాలని, బయటికి వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సాధారణ కాన్పులు జరగాలని, వేసవికాలం సందర్భంగా బుధవారం, శనివారం ఉదయం 8గంటలలోపు వ్యాక్సిన్‌ అందిచాలన్నారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది సత్యనారాయణ, చంద్రన్న, ఫార్మాసిస్ట్‌ తిరుమల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సర్వీస్‌ రూల్స్‌ అమలుకు చర్యలు చేపట్టాలి

గద్వాల న్యూటౌన్‌: రాష్ట్రంలో రెండు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సర్వీస్‌ రూల్స్‌ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని పీఆర్‌టీయూ టీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వీస్‌ రూల్స్‌ అమలుకు నోచుకోకపోవడం వల్ల విద్యాశాఖలో ఎంఈఓ, డైట్‌ లెక్చరర్స్‌, డీఈఓ పోస్టులు 95 శాతం ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దీనివల్ల పర్యవేక్షణ కొరవడి విద్యాభివృద్ధికి ఆటంకం కలుగుతోందని అన్నారు. పంచాయతీరాజ్‌ ఉపాధ్యాయులు, లోకల్‌క్యాడర్‌ ఆర్గనైజేషన్‌ 2018 ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ ద్వార జరగడం వల్ల సర్వీస్‌రూల్స్‌ రూపొందించడం సులభమని, దీని ఏర్పాటుకు కృషి చేయాలని కేంద్రప్రభుత్వ అధికారి మాణిక్‌ రాజ్‌కన్నన్‌ తమ సంఘం పక్షాన కోరామని తెలిపారు. మల్టీజోన్‌–2లో జీహెచ్‌ఎం, ఎస్‌ఏ విభాగాల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి స్నేహ పూర్వక వాతావరణాన్ని కల్పించడం శుభసూచకమన్నారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయాలని, పదవీ విరమణ బెనిఫిట్స్‌ను నగదు రూపంలో ఇవ్వాలన్నారు.సంఘం జిల్లా అధ్యక్షుడు తిమ్మారెడ్డి, ప్రధానకార్యదర్శి వేణుగోపాల్‌, గౌరవ అద్యక్షుడు నర్సింహ్మరెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, ఏబేలు, శివశంకర్‌రెడ్డి, ప్రబాకర్‌, సలాంఖాన్‌ పాల్గొన్నారు.

వేరుశనగ @ 6,526

గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు గురువారం 863 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6526, కనిష్టం రూ.2699, సరాసరి రూ.5069 ధరలు పలికాయి. అలాగే, 52 క్వింటాళ్ల ఆముదం రాగా గరిష్టం రూ.5529, కనిష్టం రూ.3016, సరాసరి రూ.5301 ధరలు వచ్చాయి. 18 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ.9706, కనిష్టం రూ.8069, సరాసరి రూ. 9666 ధరలు పలికాయి.

1/1

Advertisement
Advertisement