వైభవంగా అయ్యప్ప పడిపూజ
గద్వాలటౌన్: అభిషేక ప్రియుడైన హరుడు.. అలంకార ప్రియుడైన హరిసుతుడు మణికంఠుని సేవలో పట్టణ వాసులు పులకించారు. స్థానిక అయ్యప్పస్వామి ఆలయంలో సోమవారం పడిపూజ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అయ్యప్ప స్వాములు, భక్తులతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. మణికంఠుడికి మంగళకర పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అరటి బొదెలు, వివిధ రకాల పుష్పాలతో దేవతా మూర్తులు కొలువుదీరిన అయ్యప్ప పడిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రారంభంతో విఘ్నాధిపతి వినాయకుడు, చివరన సిరులనొసగే మహాలక్ష్మి అమ్మవార్ల మధ్య హరిహరసుతుడు కొలువుదీరాడు. న్యాయవాది గంగాధర్, డాక్టర్ అభినేష్ ఆధ్వర్యంలోని కార్యక్రమానికి గురుస్వామి రాములు పూజకు అర్చకత్వం వహించారు. మొదటి నుంచి చివరి వరకు సాగిన పడిపూజ మహోత్సవం వైభవంగా సాగింది. భక్తులు ఆలపించిన అయ్యప్ప గీతాలు ఆధ్యాత్మిక చింతను కలిగించాయి. అయ్యప్ప పడిపూజకు కర్నూల్ ఎంపీ నాగరాజు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత, మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు హజరై పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment