ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
గద్వాలటౌన్ : ‘చాయ్ తాగే సమయంలోపు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించొచ్చని టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో స్పష్టమైన హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రిగా మాట నిలబెట్టుకోవాలని’ అని పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు 23వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షకు ఎంపీ డీకే అరుణతో పాటు వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. బుధవారం కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీ డీకే అరుణ ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులుగా ఉద్యోగులు సమ్మె నిర్వహిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కేజీబీవీలోని విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకుంటే ప్రభుత్వంపై సమరం సాగిస్తామని హెచ్చరించారు. ప్రతి ఉద్యోగికి జీవిత భీమా, ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలన్నారు. అనంతరం ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సీఎం రేవంత్‌రెడ్డి మాస్కులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు, ఎస్‌ఓలు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment