రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తాం
అలంపూర్: డీసీసీబీ బ్యాంక్ ద్వారా రైతులకు అన్ని రకాల రుణాలు అందిస్తామని డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. అలంపూర్ పీఏసీఎస్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. మూడు సొసైటీలు కలిపి రూ.50 కోట్ల లావాదేవీలు పూర్తి చేసుకున్న సందర్భంలో నిర్వహించిన సమావేశానికి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేయడంతోపాటు క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న డీసీసీబీ బ్యాంక్ ద్వారా ఈ ఏడాది రూ. 1550 కోట్ల లావాదేవీలు జరిపిందని, గతేడాది రూ. 1200 కోట్లు అని వివరించారు. ఆరు నెలల్లోనే రూ. 350 కోట్ల లావాదేవీలు పెరిగిందన్నారు. 2024 డిసెంబర్ నుంచి జనవరి వరకు మూడు సొసైటీలు కలిపి రూ. 50 కోట్ల లావాదేవీలు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గతేడాది ఈ మూడు సొసైటీలు రూ. 38 కోట్ల లావాదేవీలు చేయగా ఆరు నెలల్లోనే రూ.12 కోట్ల పెంచినట్లు తెలిపారు. అలంపూర్ డీసీసీబీ బ్యాంక్‌లో మరో మూడేళ్లలో రూ.100 కోట్ల వరకు లావాదేవీలు జరిగే విధంగా చూస్తామన్నారు. 5 ఎకరాల పొలం ఉన్న రైతులకు కర్శకమిత్ర ద్వారా రూ.10 లక్షలు, మార్టిగేజ్ లేకుండా రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాలు అందిస్తామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రైతులకు ఇంటి నిర్మాణం కోసం రూ. 25 లక్షలు, గ్రామాల పరిధిలో ఉన్న రైతులకు ఇంటి కోసం రూ.15 లక్షల వరకు రుణాలు ఇస్తుందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడైన చదువుకోవడానికి రైతు బిడ్డలకు రూ.10 లక్షలు, ఇతర దేశాల్లో విద్యను అభ్యసిస్తే రూ.35 లక్షల వరకు రుణ సౌకర్యం ఉందన్నారు. రైతులకు బంగారంపై 15 నిమిషాల్లో రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రూ.2 లక్షల రుణ మాఫీలో భాగంగా ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.29 కోట్లు వచ్చినట్లు తెలిపారు. జోగుళాంబ అమ్మవారి ఆశీస్సులు ఉండటంతో రైతులకు సేవ చేసే అవకాశం లభించిందని, డీసీసీబీ బ్యాంక్ ఆర్‌బీఐ మార్గదర్శకాలతో, రైతు పక్షపాతిగా డీసీసీబీ పనిచేస్తోందన్నారు. రైతులకు అన్ని విధాలుగా రుణాలు అందించేంది డీసీసీబీ బ్యాంక్ ఒక్కటే అని, సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ రంగారెడ్డి, డీసీసీబీ సీఈఓ పురుషోత్తం రావు, పీఏసీఎస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి, గజేందర్ రెడ్డి, రాఘవ రెడ్డి, బ్యాంక్ మేనేజర్ రేణుకమ్మ, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment