మిర్చి రైతు కన్నీరు
గద్వాల వ్యవసాయం: ఎర్రబంగారం (ఎండుమిర్చి) పండించిన రైతులు తెల్లబోయే పరిస్థితి ఏర్పడింది. ఎండుమిర్చికి వస్తున్న ధరలు రైతుకు కన్నీరు పెట్టిస్తున్నాయి. వానాకాలం సీజన్‌లో భాగంగా సాగు చేసిన ఎండుమిర్చి చేతికి వచ్చింది. విక్రయించడానికి మార్కెట్‌కు వెళ్తున్న రైతులు వస్తున్న ధరలను చూసి విలవిలలాడుతున్నారు. గడిచిన ఏడాది త్రిప్స్ లాంటి పలు రకాల తెగుళ్లకు తోడు తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. దిగుడబడులకు తోడు ఽగిట్టుబాటు ధరలు రాలేదు. గడిచిన ఏడాది నష్టాన్ని దిగమింగుకొని.. ఈఏడాది నడిగడ్డలో 34,073 ఎకరాల్లో సాగు చేశారు. ఈఏడాది సైతం ధరలు రాక అల్లాడుతున్నారు.
జిల్లాలో ఎండు మిర్చి సాగు..
గడిచిన 14 ఏళ్లుగా ఇక్కడి రైతులు ఎండుమిర్చి సాగు దృష్టి సారిస్తున్నారు. బోర్లు, బావుల కిందతో పాటు నల్లరేగడి భూముల్లో వర్షాధారం కింద మిర్చి సాగు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించి పంట బాగా చేతికి వస్తే పత్తి కన్నా మిర్చికి మంచి ధరలు లభిస్తాయన్న ఉద్దేశంతో ఈ పంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరాకు 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఎకరాకు రూ.60వేల నుంచి 70వేల వరకు సాగుఖర్చులు అవుతాయి. కరుణ, సూపర్‌టెన్, జిత్రి, కావేరి, తేజచిల్లి, బ్యాడిగ తదితర రకాలను ఎక్కువగా ఈప్రాంతంలో రైతులు సాగు చేస్తున్నారు.
జిల్లాలో
ఎండుమిర్చి సాగు ఇలా..
మండలం సాగు (ఎకరాల్లో)
ఇటిక్యాల 8,368
మానవపాడు 5,759
గద్వాల 4,361
అయిజ 4,301
గట్టు 3153
మల్దకల్ 2,869
ఉండవెళ్లి 2,771
రాజోళి 795
వడ్డేపల్లి 783
అలంపూర్ 683
ధరూరు 131
కేటీదొడ్డి 99
వానాకాలంలో సాగు చేసిన ఎండుమిర్చి గడిచిన నెల నుంచి చేతికి వచ్చింది. తెగుళ్లు, వాతావరణ పరిస్థితులతో ఈ ఏడాది సైతం దిగుబడులు ఆశించిన స్థాయిలో రాలేదు. అయితే స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ఇక్కడి రైతులు చాలామంది ఏజెంట్లకు విక్రయిస్తారు. కొంతమంది కర్నూలు, గుంటూరు, రాయచూర్, హుబ్లీలలో మరికొంత మంది మాత్రమే రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాల్లో విక్రయిస్తారు. కాగా ఎండుమిర్చిలో వైరెటీని బట్టి ధరలు లభిస్తాయి. క్వింటాలు రూ.23 వేలు పలకాల్సిన 5531, అకిర, 341, వైష్ణవి, సూపర్‌టెన్ తదితర వైరైటీలకు రూ.10వేల నుంచి రూ.11వేలు, రూ.25వేలు పలకాల్సిన తేజచిల్లి లాంటి వైరెటీలు రూ.13వేల నుంచి రూ.14వేలు, రూ.45 నుంచి రూ.55వేలు రావాల్సిన బ్యాడిగ, 2043, కడ్డిబ్యాడిగ 4043 వైరెటీలకు రూ.16వేల నుంచి రూ.18వేలు ధరలు వస్తున్నాయి.ఈ ధరలను చూసి రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాదారణ వైరెటీలకు క్వింటాలుకు కనీసం రూ. 25వేలు వస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఇక మరికొన్ని వైరైటీలకు రూ.45వేల నుంచి రూ.50వేలు వస్తేనే ఆర్థికంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు.
కనీస ధర రావడం లేదు
ఏటా ఎండుమిర్చి సాగు చేస్తాను. ఈ సారి 10 ఎకరాల్లో వేశాను. అయితే గడిచిన రెండేళ్లుగా దిగుబడులు, ధరలు తగ్గాయి. ఈ ఏడాది ధరలు మరింత తగ్గాయి. పెట్టుబడి కూడా రావడం లేదు. ప్రభుత్వం ఎండుమిర్చికి వస్తున్న ధరలపై దృష్టి సారించి, రైతులకు న్యాయం చేయాలి.
– వెంకటేశ్వర్లు, రైతు,
చిన్నిపాడు, మానవపాడు మండలం
ఏటా నష్టం వస్తోంది
రెండు ఎకరాల్లో మర్చి పంట సాగు చేశాను. ఈ ఏడాది తెగుళ్ల వల్ల పెట్టుబడులు ఎక్కువ అయ్యాయి. ధరలు బాగా తగ్గాయి. ఏ వైరెటీకి కూడా ధరలు రావడం లేదు. ఏటా నష్టం వాటిల్లుతోంది. స్థానికంగా మార్కెట్ సౌకర్యం లేకపోవడం కూడా ఇబ్బందిగా ఉంది.
– రామకృష్ణ, రైతు,
అమరవాయి, మల్దకల్ మండలం.
దిగుబడులు, ధరలు తగ్గడంతో నష్టాలు
చేతికి అందిన వానాకాలం పంట
స్థానికంగా మార్కెట్ లేక మరిన్ని ఇక్కట్లు
జిల్లాలో 34,073 ఎకరాల్లో సాగు
రెండేళ్లు నిరాశే..
గడిచిన 2022–23లో జిల్లాలో 36వేల ఎకరాల్లో ఎండుమిర్చి సాగు చేశారు. పంట బాగా వస్తుందనుకునే సమయంలో త్రిప్స్ తెగుళ్లు ఆశించాయి. ఈ తెగుళ్ల ప్రభావం పంట దిగుబడులపై పడింది. దిగుబడులు తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోయారు. 2023–24లో వాతావరణం అనుకూలిస్తుందని రైతులు ఆశించారు. 65,113 ఎకరాల్లో సాగు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. దీనికి తోడు పంటకు త్రిప్స్, ఎండు, మడత తెగుళ్ళు, జెమిని వైరస్ ఆశించాయి. ఎకరాకు కనీసంగా 15 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా కేవలం 8 నుంచి 12 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇదే సమయంలో ధరలు కూడా పడిపోయాయి. ధరలు రాకపోవడంతో నెలల తరబడి శీతల గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment