అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
గద్వాల : అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలైన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని కలెక్టర్ బీఎం సంతోష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నూతన రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాలపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇదొక నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని, జిల్లాలో ఏ ఒక్కరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అమలు జరిగే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. అన్ని మండల కేంద్రాలు, మున్సిపాలిటీలు, కలెక్టర్ కార్యాలయంలో నిరంతరాయంగా ప్రజా పాలన కేంద్రాలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ అన్ని పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుత జాబితాలో పేర్లు లేని వారు కూడా ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దరఖాస్తు చేయని వారు ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామ సభలలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి పథకాల అమలుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
సాగుకు యోగ్యం కాని భూములు గుర్తించాలి
గద్వాల వ్యవసాయం: సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియా నాయక్ సూచించారు. ఆదివారం ఆయన గద్వాల శివారులోని భూముల గుర్తింపు కార్యక్రమాన్ని ఏడీఏ సంగీతలక్ష్మీతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా సర్వే చేస్తున్న అక్కడి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. గద్వాల శివారులో వెలసిన లేఔట్లు, స్కూల్ భవనాలు, పౌల్ట్రి ఫాంలు, చేపల చెరువులు తదితర భూములను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. సాగుకు అనువుకాని భూములను గుర్తించి, నిజమైన రైతులకు నష్టం రానివ్వకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాగుకు యోగ్యం కాని భూముల గుర్తింపును వేగవంతం చేయాలని సూచించారు. డిప్యూటీ తహశీల్దార్ శివకుమార్, ఏఈఓ ఉషశ్రీ, ఇతర సిబ్బంది ఈకార్యక్రమంలో ఉన్నారు.
ఏడు పదుల
స్నేహ బంధం
అలంపూర్: వారంతా 1968లో కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించారు. వైద్య వృత్తి పూర్తి చేసిన అనంతరం అమెరికా.. లండన్.. నేపాల్ ఇలా ఎన్నో దేశాల్లో స్థిరపడ్డారు. మెడికల్ కళాశాలలో విద్యనభ్యసించి దాదాపు 57 ఏళ్లవుతోంది. ప్రస్తుతం ఒక్కొక్కరి వయస్సు 70 ఏళ్ల పైమాటే. నాటి పూర్వ వైద్య విద్యార్థుంతా ఆదివారం అలంపూర్ జోగుళాంబ క్షేత్రంలో కలుసుకొన్నారు. మొదట జోగుళాంబ అమ్మవారు, స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాటి స్మృతులను గుర్తుచేసుకున్నారు. ప్రతి రెండేళ్లకోసారి కలుస్తుంటామని డాక్టర్ నరసింహారెడ్డి తెలిపారు.
మాలధారులు, భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు
అలంపూర్: అలంపూర్ జోగుళాంబ పుణ్యక్షేత్రానికి వచ్చే శివస్వాములకు, భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించాలని ఆలయ ఈఓ పురేందర్ కుమార్ అన్నారు. ఆదివారం ఆలయ సముదాయంలోని నిత్యాన్నదాన సత్రాన్ని ఈ సందర్శించారు. శివ మాలధారన చేసిన స్వాములకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన, అదేవిధంగా సాధారణ భక్తుల కోసం ఏర్పాటు చేసిన అన్నప్రసాద భోజన కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. వంటలు వండే సిబ్బందికి అన్నప్రసాదం సుచి, శుభ్రతతో సిద్ధం చేయాలని సూచించారు. ఏర్పాట్లు, అన్నప్రసాదంపై శివస్వాములు, భక్తులతో మాట్లాడారు. అన్న ప్రసాదం ఎలా ఉంది, ఏర్పాట్లు, ఏమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి శివస్వాముల కోసం ఈ అన్నప్రసాద ప్రత్యేక వసతి కల్పించినట్లు, ఫిబ్రవరి 24వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, సాధారణ భక్తులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆయనతోపాటు ఆలయ అధికారులు చంద్రయ్య ఆచారి, బ్రహ్మయ్య ఆచారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment