నేతాజీ జీవితం అందరికీ ఆదర్శం
గద్వాలటౌన్/అలంపూర్: జాతిపిత మహాత్మాగాంధీని మొట్ట మొదటిసారి ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచింది సుభాష్ చంద్రబోస్ అని, ఆజాద్ హింద్ ఫౌజ్ పేరుతో ఒక సైనిక దళాన్ని ఏర్పాటుచేసి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన వీరుడని, ఆయన జీవితం అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే విజయుడు, గురుకులాల మాజీ కార్యదర్శి, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. అలంపూర్‌లో నేతాజీ సుభాష్ జయంతి ఉత్సవాలను నేతాజీ ఫ్రెండ్స్ చైతన్య సేవా సమితి అధ్యక్షుడు వెంకట్రామయ్యశెట్టి అధ్వర్యంలో గురువారం నిర్వహించగా వారు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. చిన్నతనం అనేది ఎంతో ఆమూల్యమైనదని విద్యార్థులు తమ జీవితాన్ని ఆగం చేసుకోకుండా నిరంతరం చదువుకొని గొప్ప వ్యక్తులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఉన్నత చదువులతోపాటు మహనీయుల చరిత్రలు తెలుసుకోవాలన్నారు. వికాస భారతి సాహితి సంస్కృతి అధ్వర్యంలో జిల్లా స్థాయి కవి సమ్మేళనం నిర్వహించారు. కవులు, కళాకారులు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులకు సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.కార్యక్రమంలో మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ మనోరమ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో..
జిల్లా కేంద్రంలో నేతాజి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక రాజీవ్ మార్గ్ రోడ్డులోని నేతాజి విగ్రహానికి వివిధ సంఘాల నాయకులు, విద్యార్థులు వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నాయకులు ర్యాలీగా వచ్చి నేతాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో నేతాజి పాత్ర ఎంతో కీలకమైందని చెప్పారు. నేతాజీ ఆశయాలు, ఆలోచనలు నేటి సమాజానికి స్పూర్తి దాయకం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జయశ్రీ, బండల వెంకట్రాములు, దేవాదాసు, చిత్తారికిరణ్, నర్సింహా, కృష్ణ, వాసు, మోహన్‌రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ ఎంఏఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రియదర్శిణి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేతాజీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నేతాజీ జయంతి నిర్వహించి వీరమరణం పొందిన జవానులకు నివాళులర్పించారు. నాయకులు నరేష్ పటేల్, మురళి, శాంతిరాజ్, సురేష్, నవీన్, ఆగస్టీన్ తదితరులు పాల్గొన్నారు. వీహెచ్‌పీ నాయకులు నేతాజీ జయంతి వేడకలను ఘనంగా నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment