కొత్త హంగులు
ముస్తాబవుతున్న జోగుళాంబ రైల్వే స్టేషన్
● ఆకట్టుకుంటున్న ఆలయ ఆర్చితో కూడిన ముఖద్వారం
● కొనసాగుతున్న హైలెవల్ ప్లాట్‌ఫాం నిర్మాణ పనులు
ఉండవెల్లి: రాష్ట్ర సరిహద్దులోని జోగుళాంబ రైల్వే స్టేషన్ కొత్త హంగులు.. నూతన రంగులతో ముస్తాబవుతోంది. స్టేషన్‌లో ముఖద్వారాన్ని ఆకట్టుకునేలా జోగుళాంబ ఆలయ ఆకారంలో తీర్చిదిద్దారు. అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు నిత్యం వందలాది మంది భక్తులు రైళ్లలో ఈ స్టేషన్‌కు చేరుకుంటారు. ఇక్కడి నుంచి ప్రైవేట్ వాహనాల్లో ఆలయానికి చేరుకుంటారు. గతంలో జోగుళాంబ హాల్ట్‌గా ఉండగా.. దీనిని రైల్వేస్టేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో స్టేషన్ ఆధునీకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రయాణికులు రైలు ఎక్కడానికి ఇబ్బందిగా ఉండడంతో ప్రత్యేకంగా హైలెవల్ ప్లాట్‌ఫాం, ప్రయాణికులు ఉండడానికి హాల్స్, గదులు నిర్మిస్తున్నారు. అయితే, స్టేషన్‌లో అభివృద్ధి పనులు వేగవంతం చేసి మహాశివరాత్రికి పూర్తి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
బోర్డు లేక ఇబ్బందులు
ఇదిలాఉండగా, జోగుళాంబ రేల్వే స్టేషన్ బోర్డును అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్, తిరుపతి, తదితర పట్టణాల నుంచి రైళ్లలో వచ్చే ప్రయాణికులు బోర్డు లేకపోవడంతో ముందు స్టేషన్‌లో దిగుతున్నారు. వెంటనే బోర్డు ఏర్పాటు చేయాలని, అలాగే స్టేషన్ నుంచి ఆలయానికి బస్సులు లేక రాత్రి, ఉదయం సమయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సమస్యలు పరిష్కరించాలని భక్తులు, రైలు ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment