దరిచేరని పర్యాటకం!
వనపర్తి: సంస్థానాదీశుల కాలంలో నిర్మితమై ‘తెలంగాణ శ్రీరంగం’గా పేరొందిన శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం పర్యాటక శోభను సంతరించుకునే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. గత నెల 29 బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర పర్యాటక విధాన సమీక్షలో ఈ ఆలయం గురించి చర్చకు రాకపోవడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సుమారు 345 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కొన్ని దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ప్రస్తుత, గత ప్రభుత్వంలోనూ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులే ఉన్నా.. శిల్పకళా వైభవోపేతమైన ఈ ఆలయంపై నిర్లక్ష్య గ్రహణం వీడటం లేదు. ఇటీవల శ్రీరంగాపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాజేంద్రప్రసాద్‌యాదవ్, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రస్తుత రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసి ఆలయానికి పర్యాటక శోభ కల్పించాలని వినతిపత్రం కూడా సమర్పించారు. అయినా గతవారం రాష్ట్రస్థాయిలో నిర్వహించిన సమగ్ర పర్యాటక విధానం సమీక్షలో ఈ విషయాన్ని చర్చించకపోవడం శోచనీయం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎకో, టెంపుల్ టూరిజంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. గతంలోనే ఈ ఆలయ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న ప్రతిపాదనలతో కేంద్రం నుంచి కొంతమేర నిధులు విడుదలైనా విషయం ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉన్నా.. పాలకులు నిర్ల క్ష్యం స్థానికంగా అసహనాన్ని నింపినట్లయింది.
కృష్ణ విలాస్ ప్రత్యేక ఆకర్షణ..
వనపర్తి సంస్థానాదీశులు నిర్మించిన ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆలయ ప్రహరీని ఆనుకొని ఉన్న రంగసముద్రం నడిబొడ్డున గతంలో కృష్ణవిలాస్ పేరుతో పెద్ద విశ్రాంతి భవనం ఉండేది. సంస్థానాదీశులు స్వామివారిని దర్శించుకున్న సమయంలో అందులో సేద తీరేవారు. కాలక్రమేణా ఆ భవనం శిథిలమైంది. ఇప్పటికీ రిజర్వాయర్ మధ్యలో 155 ఫీట్ల పొడవు, 55 ఫీట్ల వెడల్పు స్థలం కనిపిస్తుంది. ఆలయం నుంచి అక్కడి వరకు బోటు షికారు చేయవచ్చు. స్వామివారి ప్రధాన ఆలయ నేలమాళిగల్లో ఎంతో విలువైన తంజావూరు పెయింటింగ్స్‌ను భక్తులు తిలకించవచ్చు. అలాగే రిజర్వాయర్ కట్టను ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దవచ్చు. ఆలయాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దితే భవిష్యత్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
ఆకట్టుకునే శిల్పకళా సంపద..
రంగసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఒడ్డున తంజావూరు పెయింటింగ్స్, శిల్పకళా సంపదతో నిర్మించిన ఈ ఆలయానికి భక్తులు విశేష సమయాలతో పాటు సాధారణ రోజుల్లోనూ భారీగా వస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని ఎకో, టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల సమయంలో బీచుపల్లి, రంగాపూర్ పుష్కర ఘాట్ల వద్ద స్నానమాచరించిన భక్తులు చాలామంది రంగనాథస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థన మేరకు గతంలో భక్తులు బస చేసేందుకు అతిథి గృహం, తెలంగాణ టూరిజం రిజర్వాయర్‌లో బోటు షికారు ఏర్పాటు చేశారు. కాగా నిర్వహణ లేక అతిథిగృహం శిథిలావస్థకు చేరుకోగా బోటును ఇతర ప్రాంతానికి తరలించారు.
మరోసారి నిరాదరణకు గురైన ‘తెలంగాణ శ్రీరంగం’
గత నెల 29న పర్యాటకశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
శ్రీరంగాపురం అంశాన్ని ప్రస్తావించని జిల్లా ప్రజాప్రతినిధులు
ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేరేనా?
Comments
Please login to add a commentAdd a comment