ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దు
రాజోలి: మండలంలోని పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న రిలే నిరాహార దీక్ష ఆదివారం 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా యువకులు, విద్యావంతులు దీక్షలో పాల్గొన్నారు. గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటుతో గ్రామ ప్రజల్లో తమ పొలాలు తమ భవిష్యత్తుపై గందరగోళం నెలకొందని అన్నారు. ఈ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు వెలువడితే పిల్లలు, పెద్దలంతా అనారోగ్యంతో ఆస్పత్రి పాలవుతున్నారని ఇలాంటి సంఘటనలు జరుగుతాయని, ఇలాంటి ఫ్యాక్టరీల ద్వారా ఇలా జరుగుతున్నాయన్నారు. తక్షణమే ఫ్యాక్టరీ ఏర్పాటును నిలిపివేయనున్నారు. కార్యక్రమంలో పెద్దధన్వాడతో పాటు ఆయా గ్రామాల ప్రజలుపాల్గొన్నారు.
నైతిక విలువలకు
శతక ప్రక్రియ దోహదం
స్టేషన్ మహబూబ్‌నగర్: సాహిత్య రంగానికి తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఐదేళ్ల వార్షికోత్సవ వేడుకలను ఆదివారం జిల్లాకేంద్రంలోని స్కౌట్స్ అండ్ గైడ్స్ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ కవయిత్రి రావూరి వనజ రచించిన ‘వాణి శతకం’ పుస్తకావిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పిల్లల చేత రామాయణం, భాగవతాలు చదివించాలన్నారు. నైతిక, మానవతా విలువలకు శతక ప్రక్రియ దోహదపడుతుందన్నారు. జ్ఞానాన్ని అందించే వాణి కరుణ ఉండాలని, చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతిదేవి పుట్టిన రోజు వాణిశతకం ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. మరో అతిథి ఆచార్య మసన చెన్నప్ప మాట్లాడుతూ వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు వాణి కరుణ వల్లనే ఆవిర్భవిస్తాయన్నారు. వాణిశతకం భక్తి ప్రపత్తులతో కూడుకున్నదని చెప్పారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మహిళా సాహిత్య, సాంస్కృతిక సంస్థ ఐదేళ్ల నుంచి చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రముఖ వక్త డాక్టర్ పొద్దుటూరి ఎల్లారెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో సాహిత్యాలాభిషను రేకెత్తించేలా సంస్థ చేస్తున్న సాహితీ కార్యక్రమాలను కొనియాడారు. గంటా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పాలమూరు జిల్లా కవులు, కళాకారులకు నిలయం అన్నారు. మహిళలు సాహిత్య సంస్థను నడుపుతూ చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమన్నారు. చుక్కాయపల్లి శ్రీదేవి పుస్తక సమీక్ష చేశారు.
బడ్జెట్‌లో దళితులకు
తీవ్ర అన్యాయం
మహబూబ్‌నగర్ రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బడ్జెట్‌లో దళితులకు తీవ్ర అన్యాయం చేశారని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో దళితులను మోసం చేసిన బీజేపీ విధానాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ కేంద్ర బీజేపీ సర్కార్ బడ్జెట్ అంకెలు పెంచడం తప్ప ఆచరణలో దళితుల అభివృద్ధికి చేసిందేమి లేదన్నారు. దళితులకు జరిగిన అన్యాయంపై ప్రతిఒక్కరు ప్రశ్నించాలన్నారు. దేశంలో 20 కోట్లు ఉన్న దళితులకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయింపులు చేయలేదని విమర్శించారు. కేంద్ర బీజేపీ సర్కార్ గత పదేళ్లుగా కాగితాల్లో అంకెలను పెంచుతూ వాటి ఖర్చులో తుంచుతూ దళితులకు అన్యాయమే చేస్తుందని విమర్శించారు. 20 శాతం జనాభా కలిగిన దళితులకు 16 శాతం మాత్రమే బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయన్నారు. 2024– 25 బడ్జెట్‌లో రూ.1,65,597.70 కోట్లు కేటాయిస్తే.. ఇప్పుడు కేవలం రూ.3 వేల కోట్లు మాత్రమే పెంచారని, అది కూడా జనాభా దామాషా ప్రకారం లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలు చేయకపోవడం వల్ల దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించడం లేదన్నారు. దశాబ్దకాలంలో కేంద్రం దళితుల కోసం కేటాయించిన బడ్జెట్, ఖర్చు చేసిన నిధులు, ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment