విక్రయానికి తల్లి ఒప్పుకోలేదనే శిశువు హత్య
కాకినాడ క్రైం: ఆడపిల్ల పుట్టిందనే కోపంతో రగిలిపోతున్న అతడు ఆ శిశువుకు విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. దానికి తల్లి ఒప్పుకోకపోవడంతో 34 రోజుల బిడ్డను దారుణంగా చంపేశాడు. మంగళవారం జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ వన్ టౌన్ సీఐ ఎం.నాగదుర్గారావు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. జగన్నాథపురం పప్పుల మిల్లు సమీపంలో నివసిస్తున్న కేతా శివమణి తనకు ఆడపిల్ల పుట్టిందని కోపంతో ఉండేవాడు. చివరకు ఆ పాపను అమ్మేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని మంగళవారం శిశువు తల్లి అయిన తాను సహజీవనం చేస్తున్న చెక్కా భవానీతో చెప్పాడు. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. పాపను చంపాలని నిర్ణయించుకుని తొలుత గొంతునులిమాడు. కొనప్రాణాలతో కొట్టుమిట్టాడున్న శిశువును గోడకేసి కొట్టి పరారయ్యాడు. వెంటనే తల్లి స్థానికుల సాయంతో పాపను ఆసుపత్రికి తరలించగా శిశువు మృతి చెందిందని వైద్యులు నిర్థారించారు. కాగా.. పరారీలో ఉన్న శివమణిని ప్రత్యేక బృందాలు డాగ్ స్క్వాడ్ సాయంతో గాలించి పట్టుకున్నాయి. అతడిని బుధవారం ఉదయం అరెస్టు చేసి కాకినాడ మూడో ఏజేఎఫ్‌సీఎం కోర్టుకు రిమాండ్ కోసం తరలించామన్నారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్న సీఐ నాగదుర్గారావు, ఆయన బృందాన్ని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
ఆడపిల్లను చంపిన తండ్రి అరెస్టు
రిమాండ్‌కు తరలింపు
Comments
Please login to add a commentAdd a comment