చోరీ కేసులో ఇద్దరు యువకుల అరెస్టు
కొత్తపేట: చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.13 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్ బుధవారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. కొత్తపేట బ్యాంకు కాలనీలో నివాసముంటున్న రామోజు అనురాధ, తన కుటుంబ సభ్యులతో ఈ ఏడాది మే 5వ తేదీ సాయంత్రం రాజమహేంద్రవరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి 9వ తేదీ ఉదయం ఇంటికి రాగా తలుపుబద్దలు కొట్టి తెరిచి ఉంది. ఇంట్లోకి వెళ్లి బీరువాలో పరిశీలించగా దానిలో భద్రపరిచిన బంగారం, వెండి వస్తువులు కనిపించలేదు. దీంతో ఆమె ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై ఎం.అశోక్ కేసు నమోదు చేశారు. ఎస్పీ బి.కృష్ణారావు పర్యవేక్షణలో డీఎస్పీ వై.గోవిందరావు ఆధ్వర్యంలో రావులపాలెం రూరల్ సీఐ సీహెచ్ విద్యాసాగర్, ఎస్సై జి.సురేంద్ర దర్యాప్తు జరిపారు. ఈ సందర్భంగా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన బండారు మణికంఠ, చింతపల్లి వెంకటరాజు అనే యువకులను అరెస్టు చేశారు. వారి నుంచి 212 గ్రాముల బంగారం వస్తువులు, 2 కేజీల వెండి వస్తువులు, వాచీ స్వాధీనం చేసుకున్నారు. కాగా.. ఈ కేసును చేధించిన డీఎస్పీ వై.గోవిందరావు, సీఐ విద్యాసాగర్, సీసీఎస్ సీఐ డి.ప్రశాంత్, ఎస్సై జి.సురేంద్ర, సీసీఎస్ ఏఎస్సై ఏ.బాలకృష్ణ, హెచ్‌సీలు డీఎస్ స్వామి, ఎం.వీర్రాజు, పీసీలను ఎస్పీ కృష్ణారావు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment