నిష్పక్షపాతంగా విచారణ చేయండి | - | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతంగా విచారణ చేయండి

Published Fri, Oct 18 2024 3:06 AM | Last Updated on Fri, Oct 18 2024 3:06 AM

నిష్పక్షపాతంగా విచారణ చేయండి

దుమ్ములపేట ఘటనపై మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి

జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేత

కాకినాడ: దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా దుమ్ములపేటలో జరిగిన ఘర్షణపై నిష్పక్షపాతంగా విచారణ చేయాలని వైఎస్సార్‌ సీపీ కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్‌, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పోలీసు అధికారులను కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ను కలిసి వివాదంపై చర్చించారు. అంతకుముందు స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ రామకోటేశ్వరరావును పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి సమస్యపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ద్వారంపూడి విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీ రాత్రి దుమ్ములపేట ప్రాంతంలో దాసరి సతీష్‌ అనే వ్యక్తిపై శీరం చిన్న, కొండ్ర తాతారావుతోపాటు మరికొంత మంది వ్యక్తులు మద్యం మత్తులో దాడిచేసి గాయపరిచారన్నారు. ఆత్మరక్షణ కోసం దాసరి సతీష్‌ చేసిన ప్రయత్నంలో ఇద్దరు గాయపడ్డారని, ఈ వివాదానికి ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) రాజకీయ రంగు పులిమి వైఎస్సార్‌ సీపీకి చెందిన కొంతమంది నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీకి వివరించారు. ఘటన సమయంలో అక్కడిలేని వ్యక్తులను చేర్చి వీరిపై హత్యాయత్నం కేసు నమోదు చేయిస్తున్నారన్నారు. దసరా ఉత్సవాల పరిసర ప్రాంతాలకు కూడా వెళ్లని క్రైస్తవుడైన మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ వాసుపల్లి కృష్ణ, అతని మిత్రులు, బంధువులను కేసులో చేరుస్తున్నారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. ఎమ్మెల్యే కొండబాబు చెప్పిన పేర్లను కేసులో చేర్చవద్దని ఎస్పీని కోరారు. గతంలో కూడా ఇటువంటి ఘర్షణలు జరిగిన సమయంలో సెక్షన్‌ 307 పెట్టిన దాఖలాలు లేవని, ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతోనే ఇటువంటి పనులు చేస్తున్నారని ద్వారంపూడి పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ కాకినాడ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కౌడా మాజీ చైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బెండా విష్ణు, స్మార్ట్‌సిటీ మాజీ చైర్మన్‌ అల్లి రాజబాబు, జిల్లా ఐటీ సెల్‌ చైర్మన్‌ కృష్ణప్రియ, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement