నిరసన జ్వాల
● ఎన్నికల హామీలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
● వైద్య,ఆరోగ్యశాఖ సిబ్బంది
ఆందోళనలు
● అయినా పట్టించుకోని పాలకులు
ఆలమూరు: ప్రజల ఆరోగ్యం కోసం నిత్యం సేవలు అందించే వైద్య, ఆరోగ్య సిబ్బందిలో అసంతృప్తి జ్వాల రగిలింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆందోళన బాట
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, నేషనల్ హెల్త్ మిషన్‌లో ఒప్పదం ఉద్యోగులుగా పనిచేస్తున్న గ్రేడ్–2 ఏఎన్‌ఎం, జీఎన్‌ఎంగా శిక్షణ పొంది వెనక్కి వచ్చిన గ్రామ సచివాలయ ఏఎన్‌ఎంలు తమ గళాన్ని విప్పుతున్నారు. వైద్య,ఆరోగ్యశాఖలో ఇచ్చిన హామీలకు గ్రహణం పడటంతో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహం చెంది ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు చేపట్టారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన
ఎన్నికల హామీలను నెరవేర్చాలని కూటమి ప్రభుత్వాన్ని ఉమ్మడి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు డిమాండ్ చేశారు. దీనిలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి తొమ్మిది వరకూ విధులు నిర్వహిస్తూనే మధ్యాహ్న భోజన సమయంలో నిరసనలు తెలిపారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ నెల 21న రాష్ట్ర సీహెచ్‌ఓ సమాఖ్య పిలుపు మేరకు చలో విజయవాడ పేరుతో అక్కడకు వెళ్లి ఆందోళన నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలందరికీ అంకిత భావంతో సేవలను అందిస్తున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పనిచేస్తున్న 1,428 మందికి ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేశారు. అనంతరం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు.
పదోన్నతులు కల్పించాలని..
దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రేడ్ 2 ఏఎన్‌ఎంలు కోరుతున్నారు. రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం అసోసియేషన్ ఆదేశాల మేరకు ప్రతి నెలా మూడో సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేట్‌లో విజ్ఞాపన పత్రాలను అందజేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతున్నా తమ సమస్యలపై స్పందించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. నేషనల్ హెల్త్ మెషీన్‌లో 16 ఏళ్ల నుంచి చాలీచాలని వేతనాలతో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్న తమను రెగ్యులర్ చేసి, గ్రేడ్ –1 ఏఎన్‌ఎంలుగా పదోన్నతులు కల్పించాలన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 21న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 157 మంది గ్రేడ్ 2 ఏఎన్‌ఎంలు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం రూపంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. అక్కడే ఉన్న జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి ఒకరు గ్రేడ్ – 2 ఏఎన్‌ఎంలను ఉద్దేశించి వీరెవ్వరూ తమకు తెలియదంటూ వ్యాఖ్యానించడంతో కార్యాలయం బయటకు వచ్చి నిరసనలు జరిపారు. రీడిప్లమెంట్ పేరిట గ్రేడ్ 2 ఏఎన్‌ఎంలను ఇష్టానుసారం బదిలీలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆర్‌సీహెచ్ పోర్టల్‌లో తాము అందిస్తున్న సేవలకు ఇచ్చే పారితోషికాన్ని ఇతర ఉద్యోగులకు జమ చేయడం ఎంత వరకూ సమంజమని ప్రశ్నించారు.
సీహెచ్‌వోల డిమాండ్లు
● కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా నేషనల్ హెల్త్ మిషన్‌లో పని చేస్తున్న సీహెచ్‌ఓలకు ఉద్యోగ భద్రత కల్పించాలి.
● నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల మాదిరిగా వేతనాలను అందించి టీఏ, డీఏ బిల్లులు చెల్లించాలి.
● రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.25 వేల వేతనానికి అదనంగా రూ.15 వేల పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ కలిపి ఒక్కొక్క ఉద్యోగికి రూ.40 వేలు అందించాలి.
● పెండింగ్‌లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ విద్యుత్ బిల్లులు, అద్దె బకాయిలు సత్వరమే విడుదల చేయాలి.
● ప్రావిడెంట్ ఫండ్‌ను పునరుద్ధరించి హెచ్‌ఆర్ పాలసీని అమలు చేయాలి.
● ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను శుభ్రపర్చడం కోసం కంటిజెంట్ వర్కర్‌ను నియమించుకునేందుకు నెలకు రూ.మూడు వేలు కేటాయించాలి.
కాంట్రాక్ట్ గ్రేడ్ –2 ఏఎన్‌ఎంల డిమాండ్లు
● సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు సమాన పనికి సమాన వేతనం అందించాలి.
● గ్రేడ్–2 ఏఎన్‌ఎంలకు గ్రేడ్ – 1గా పదోన్నతి కల్పించి రెగ్యులర్ చేయాలి.
● రీడిప్లమెంట్ పేరిట అధికారుల వేధింపులు, బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలి.
ఎన్నికల సమయంలో హామీల వర్షం
అధికారంలోకి రావడం కోసం ఎన్నికల సమయలో కూటమి నాయకులు వైద్య, ఆరోగ్య సిబ్బందికి అనేక హామీలు ఇచ్చి, నెరవేరుస్తామని వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా ఇప్పటి వరకూ పెదవి విప్పడం లేదు. దీంతో విసిగిపోయిన వైద్య, ఆరోగ్య సిబ్బంది నిరసనలు చేపట్టారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండు చేస్తున్నారు.
ఉన్నతాధికారుల దృష్టికి సమస్యలు
వైద్య,ఆరోగ్య శాఖలోని ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర కమిషనరేట్ దృష్టిలోకి తీసుకువెళతామని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీఎంహెచ్‌ఓ కార్యాలయాల ప్రతినిధులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల్లో పనిచేస్తున్న సీహెచ్‌ఓలు, అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న గ్రేడ్–2 ఏఎన్‌ఎంలు సమస్యలపై నివేదిక రూపొందించామన్నారు. శిక్షణ పొందిన జీఎన్‌ఎంల సమస్య ప్రభుత్వ దృష్టిలో ఉందన్నారు.
జీఎన్‌ఎంల పరిస్థితి ఏమిటి?
గత ప్రభుత్వం 2022 ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 264 మంది గ్రామ మహిళ ఆరోగ్య సంరక్షణ కార్యదర్శులను విద్యార్హతల ఆధారంగా జీఎన్‌ఎం శిక్షణకు పంపించింది. శిక్షణ పూర్తయిన తరువాత ప్రభుత్వ, ఏరియా ఆస్పత్రుల్లో జీఎన్‌ఎంలుగా పోస్టింగ్ ఇస్తామని హామీ ఇచ్చింది. రెండేళ్ల పాటు శిక్షణ పొందడంతో పాటు అదనంగా ఆరు నెలల పాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో సేవలను అందించారు. శిక్షణ పొందే సమయానికి ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అప్పటి ప్రభుత్వం జీఎన్‌ఎం పోస్టింగ్ ఇవ్వలేకపోయింది. కొత్తగా కొలువు తీరిన కూటమి ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం ప్రతిపాదనలను పక్కన పెట్టేసింది. అహర్నిశలు శ్రమించి శిక్షణ పొందిన జీఎన్‌ఎంలను తిరిగి ఏఎన్‌ఎంలుగా పనిచేసుకోవాలంటూ నాలుగు నెలల తరువాత సొంత ప్రాంతాలకు పంపించి, వారికి తీవ్ర అన్యాయం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment