నిర్లక్ష్యపు నీడలు
నడకుదురులోని సచివాలయం
కాకినాడ సిటీ: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు సులభతరంగా అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పరిపాలనను కొత్త పుంతలు తొక్కించి, గ్రామ స్వరాజ్యాన్ని తీసుకుని వచ్చిన ఈ వ్యవస్థ దేశవ్యాప్తంగానే అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 2019లో అధికారంలోకి రాగానే గాంధీ జయంతి రోజున సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రతి 2 వేల జనాభా ఉన్న గ్రామంలో రూ.40 లక్షలతో సచివాలయం, రూ.21 లక్షలతో రైతు భరోసా కేంద్రం, రూ.20.80 లక్షలతో హెల్త్ వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటు చేశారు. సచివాలయాల ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు నేరుగా, సులభతరంగా అందడంతో ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ప్రజలకు ఎంతో మేలు చేసిన సచివాలయ వ్యవస్థపై ప్రస్తుత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యపు నీడలు పరచుకుంటున్నాయి.
545 పైగా సేవలు
జిల్లాలో 620 సచివాలయాలున్నాయి. ప్రతి సచివాలయంలో గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శి, వెల్ఫేర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, డిజిటల్ అసిస్టెంట్, వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్, సర్వేయర్, వీఆర్‌ఓ తదితర 11 మంది ఉద్యోగులు అందుబాటులో ఉంటారు. సచివాలయ వ్యవస్థకు అనుబంధఃగా గ్రామ/వార్డు వలంటీర్లు కూడా ఉండేవారు. వీరి ద్వారా ప్రజలకు 545 పైగా ప్రభుత్వ సేవలు సకాలంలో అందేవి. గత ప్రభుత్వ హయాంలో కేవలం అర్హత ఉంటే చాలు.. ఎటువంటి సంక్షేమ పథకమైనా ఇంటి వద్దనే అందజేసేవారు. ప్రభుత్వ సేవ ఏదైనా సరే అర్హత ఉంటే పార్టీలతో సంబంధం లేకుండానే మంజూరు చేసేవారు. ఫలితంగా దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడింది.
నేడు ప్రజలకు తప్పని ప్రదక్షిణలు
ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం వలంటీర్ వ్యవస్థను పూర్తిగా పక్కన పెట్టేసింది. అనంతరం సచివాలయ వ్యవస్థను కూడా నీరుగార్చేలా చర్యలు చేపడుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే సచివాలయ ఉద్యోగులను కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం చేస్తూ, ఈ వ్యవస్థ లక్ష్యాన్ని దెబ్బ తీస్తున్నారని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటింది. ఇప్పటి వరకూ రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డుల వెబ్‌సైట్లు తెరచుకోలేదు. దీంతో అర్హులైన వారు సచివాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. కొత్త పింఛన్ల కోసం వెబ్‌సైట్‌ను ప్రభుత్వం తెరవకపోవడంతో వారందరూ నిరాశగా వెనుతిరగాల్సి వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి పనులు సచివాలయాలు, వలంటీర్ల ద్వారా చకచకా జరిగిపోయేవి. మరోవైపు కూటమి నేతలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై అనేక విమర్శలు చేస్తూ, అవమానకరంగా మాట్లాడారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో స్టిక్కర్లు అతికించడం నుంచి ఇంటింటి ప్రచారం వరకూ నియోగించి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం పింఛన్ల పంపిణీకే పరిమితం చేయడం ద్వారా తమను ఉద్దేశపూర్వకంగానే ఖాళీగా ఉంచుతున్నారంటూ మండిపడుతున్నారు.
2019 అక్టోబర్ 2న నాటి ముఖ్యమంత్రి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన
కరప గ్రామ సచివాలయం
కూటమి సర్కార్ హయాంలో నిర్వీర్యమవుతున్న సచివాలయ వ్యవస్థ
పింఛన్ల పంపిణీకే ఉద్యోగులు పరిమితం
ప్రభుత్వ సేవలు అందక ప్రజల అవస్థలు
కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు
మంచి సేవలందేవి
సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని వర్గాల ప్రజలకూ మంచి సేవలు అందేవి. దీనివలన తమ సమస్యల పరిష్కారానికి ప్రజలు 10, 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లే బాధ తప్పింది. జగనన్న ప్రభుత్వంలో అర్హత ఉంటే ఇంటి వద్దనే సంక్షేమ పథకాలు అందించేందుకు సచివాలయ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతగానో ఉపయోగపడేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత ఉన్న ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేని దుస్థితి. ఓ మంచి ఆశయంతో స్థాపించిన సచివాలయ వ్యవస్థను మరింత మెరుగు పరిచి స్థానికంగానే ప్రజల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– పెంకే శ్రీలక్ష్మి, ఎంపీపీ, కరప
పటిష్టం చేయాలి
గతంలో మాదిరిగా గ్రామ/వార్డు సచివాలయాలను పటిష్టం చేయాలి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందుబాటులో ఉంచిన అన్ని రకాల సేవలనూ యథాతథంగా కొనసాగించాలి. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల కోసం నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసే బాధలు ప్రజలకు తప్పాయి. ప్రజల వద్దకే పాలన, గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా ప్రభుత్వం పని చేయాలి. నిత్యం ఆధార్ అప్‌డేట్‌కు సచివాలయాల్లోనూ అవకాశం కల్పించాలి.
– అనిశెట్టి రామకృష్ణ, బంగారు, వెండి, డైమండ్స్
వర్తక సంఘం జిల్లా అధ్యక్షుడు, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment