నేడు, రేపు ఎస్టీ కమిషన్ సభ్యుని పర్యటన
కాకినాడ సిటీ: రాష్ట్ర గిరిజన కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ శుక్ర, శనివారాల్లో శంఖవరం, రౌతులపూడి మండలాల్లో పర్యటించనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. శంకర్ నాయక్ కాకినాడ నుంచి శంఖవరం మండలంలోని అనుమర్తి గ్రామానికి శుక్రవారం ఉదయం 10 గంటలకు చేరుకుంటారు. అక్కడ గిరిజనులతో సమావేశమై, సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం ఆవెల్తి గిరిజన గ్రామం చేరుకుని, ప్రజలు సమస్యలు తెలుసుకుంటారు. భోజన విరామం అనంతరం ఓంద్రిగుల గ్రామానికి వెళ్లి, గిరిజనుల సమస్యలపై చర్చిస్తారు. అక్కడి నుంచి కాకినాడ జేఎన్‌టీయూ అతిథి గృహానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. శనివారం ఉదయం 7 గంటలకు జేఎన్‌టీయూ నుంచి బయలుదేరి రౌతులపూడి మండలం పెద్దూరు చేరుకుని, గిరిజనులతో మమేకమవుతారు. అనంతరం గిన్నలరం గ్రామానికి చేరుకుని, గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారు. భోజన విరామం తర్వాత బయలుదేరి 4 గంటలకు జేఎన్‌టీయూ అతిథి గృహానికి చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం విజయవాడకు బయలుదేరుతారు.
నేడు సత్య స్వాముల పడిపూజ
అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని వార్షిక కల్యాణ మండపం వద్ద శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు సత్య స్వాముల పడిపూజ నిర్వహించనున్నారు. సత్య దీక్షలు ఆచరించిన వేలాది మంది స్వాములు సత్యదేవుని జన్మనక్షత్రం మఖ సందర్భంగా శనివారం స్వామివారి సన్నిధిలో దీక్ష విరమించనున్నారు. ఈ దీక్షల విరమణకు ముందు రోజు సత్య స్వాములతో రత్నగిరిపై ఏటా పడిపూజ చేయడం ఆనవాయితీ. పూజలో పాల్గొనే భక్తులకు ఫలహారం ఏర్పాటు చేశారు. ఈ పూజలకు వెయ్యి మందికి పైగా భక్తులు హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈఓ కె.రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు పడిపూజ ఏర్పాట్లను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రామ్మోహనరావు, ఈఈ రామకృష్ణ, ఏఈఓ కొండలరావు, డీఈ రాంబాబు తదితరులు గురువారం పరిశీలించారు.
చట్టాలు సక్రమంగా
అమలు చేయాలి
సామర్లకోట: గిరిజనులకు ఎంతో ఉపయోగపడే విస్తరణ, పీసా చట్టాలను సక్రమంగా అమలు చేయాలని స్థానిక విస్తరణ, శిక్షణ కేంద్రం (ఈటీసీ) వైస్ ప్రిన్సిపాల్ ఇ.కృష్ణమోహన్ అధికారులకు సూచించారు. ఈటీసీలో రెండు రోజుల పాటు నిర్వహించిన గిరిజనాధికారుల సమీక్ష గురువారం ముగిసింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని వివిధ శాఖల అధికారులతో గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంక్షేమం కోసం ఈ సమీక్ష నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణమోహన్ మాట్లాడుతూ, వివిధ జిల్లాల్లోని అధికారులు ఇచ్చిన సూచనలు, సలహాలతో జిల్లా, మండల స్థాయిల్లో శిక్షణ ఇచ్చేందుకు మంచి పుస్తకాలు తయారు చేసే అవకాశం కలిగిందన్నారు. వచ్చే నెల 3 నుంచి జిల్లా, మండల స్థాయి శిక్షణలు ప్రారంభమవుతాయని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థ జాయింట్ డైరెక్టర్లు రమణ, రామనాథం, శ్రీదేవి, ఈటీసీ ఫ్యాకల్టీలు పాల్గొన్నారు. సమీక్షలో పాల్గొన్న ఆయా జిల్లాల అధికారులకు సర్టిఫికెట్లు అందజేశారు.
విఘ్నేశ్వరుని హుండీ
ఆదాయం లెక్కింపు
అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వరస్వామి ఆలయంలో హుండీ ఆదాయాన్ని దేవదాయ శాఖ అధికారులు ఎం.రాధాకృష్ణ, ఉప్పలపాటి జానికమ్మ పర్యవేక్షణలో గురువారం లెక్కించారు. 60 రోజులకు గాను రూ.29,57,711 లభించినట్లు ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు. అలాగే ఏడు గ్రాముల బంగారం, 743 గ్రాముల వెండి, 17 విదేశీ నోట్లు ఉన్నాయన్నారు. ఈ లెక్కింపులో ఆలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment