సరికొత్త రికార్డు దిశగా.. | - | Sakshi
Sakshi News home page

సరికొత్త రికార్డు దిశగా..

Published Fri, Nov 22 2024 1:32 AM | Last Updated on Fri, Nov 22 2024 1:32 AM

సరికొ

సరికొత్త రికార్డు దిశగా..

కార్తికంలో ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు

మరో 60 వేలు జరిగే అవకాశం

2022 కార్తికంలో అత్యధికంగా వ్రతాలు

అన్నవరం: ఇంట్లో వివాహమైనా.. గృహప్రవేశమైనా.. ఇతర ఏ శుభకార్యమైనా.. సత్యనారాయణస్వామి వారి వ్రతం ఆచరించడం తెలుగు రాష్ట్రాల్లోని హిందూ భక్తులకు ఆనవాయితీ. ఒక్కోసారి ఏ శుభకార్యమూ లేకపోయినా పర్వదినాలు.. పుట్టిన రోజు.. పెళ్లి రోజు వంటి సందర్భాల్లో కూడా సత్యనారాయణ వ్రతాలు చేసుకుంటారు. తాము కోరుకున్న కోర్కెలను ఆ స్వామి తీరుస్తాడని, తమను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. ఒక విధంగా చెప్పాలంటే సత్యదేవుని వ్రతమాచరించని హిందువుల ఇల్లు ఉండదంటే అది అతిశయోక్తి కాదు. ఇలా ఇంటి వద్ద వ్రతం చేసుకున్నా.. ఏడాదిలో కనీసం ఒకసారైనా రత్నగిరికి వచ్చి.. భక్తవరదుడైన సత్యదేవుని వ్రతమాచరించే భక్తులు చాలా అధికంగా ఉంటారు. అందునా కార్తికం వంటి పవిత్ర మాసాల్లో మరింత మంది అన్నవరం సత్యదేవుని దర్శించి వ్రతం చేసుకుంటూంటారు.

నాలుగో వంతు వ్రతాలు కార్తికంలోనే..

హరిహరాదులకు ప్రీతికరమైన కార్తిక మాసమంతా పర్వదినాలే. దీంతో ఈ మాసంలో సత్యదేవుని వ్రతాలాచరిస్తే మరింత పుణ్యం వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ నమ్మకంతోనే వ్రతాలాచరించేందుకు రత్నగిరికి అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సంవత్సరం మొత్తం సుమారు ఏడు లక్షలు వ్రతాలు జరుగుతుండగా.. వీటిలో దాదాపు నాలుగో వంతు వ్రతాలు ఈ ఒక్క నెలలోనే జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత కార్తిక మాసంలో రత్నగిరిపై సత్యదేవుని సన్నిధిలో రికార్డు స్థాయిలో వ్రతాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఈ పవిత్ర మాసం ప్రారంభమై గురువారం నాటికి 21 రోజులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు జరిగాయి. ఈ మాసం ముగియడానికి మరో తొమ్మిది రోజుల సమయం ఉంది. ఆలోగా మరో 60 వేల వ్రతాలు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దేవస్థానం చరిత్రలో 2022 సంవత్సరం కార్తిక మాసంలో అత్యధికంగా 1,42,378 సత్యదేవుని వ్రతాలు జరిగాయి. ఆ రికార్డును ప్రస్తుత కార్తిక మాసంలో జరుగుతున్న వ్రతాలు అధిగమిస్తాయని భావిస్తున్నారు. సత్యదేవుని సన్నిధిలో సుమారు 300 మంది వ్రత పురోహితులు, 12 మంది వ్రత పురోహిత సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో ఈ వ్రతాలు చేయిస్తున్నారు.

ఆ వ్రతాలే అత్యధికం

రత్నగిరిపై రూ.300, రూ.1,000, రూ.1,500, రూ.2,000 టికెట్లతో సత్యదేవుని వ్రతాలు నిర్వహిస్తున్నారు. వీటిల్లో ప్రతి రోజూ జరుగుతున్న వ్రతాల్లో దాదాపు 70 శాతం రూ.300 టికెట్టు పైనే జరుగుతున్నాయి. సామాన్య భక్తులు ఎక్కువగా రూ.300 టికెట్టు వ్రతాలు ఆచరిస్తున్నారు. ప్రస్తుత కార్తిక మాసంలో ఇప్పటి వరకూ 93 వేల వ్రతాలు జరగగా వాటిలో దాదాపు 65 వేలు రూ.300 వ్రతాలే కావడం గమనార్హం. దేవస్థానంలో 18 వ్రత మండపాలు ఉండగా, వాటిలో ఎనిమిదింటిని రూ.300 వ్రతాల నిర్వహణకే కేటాయించారు. మిగిలిన మూడు టికెట్లపై వ్రతాలు 10 మండపాల్లో జరుగుతున్నాయి.

వ్రతాల ద్వారా అధిక ఆదాయం

ఏటా సత్యదేవునికి వస్తున్న ఆదాయంలో దాదాపు 25 శాతం వ్రతాల ద్వారానే సమకూరుతోంది. గత ఏడాది వ్రతాల ద్వారా రూ.38 కోట్లు పైగా ఆదాయం రాగా, ఇందులో ఒక్క కార్తికంలోనే సుమారు రూ.7 కోట్లు వచ్చింది. ఈ ఏడాది కార్తిక మాసంలో రూ.8 కోట్లు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకూ జరిగిన 93 వేల వ్రతాల ద్వారా రూ.6 కోట్లు పైగా వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

సత్యదేవుని వ్రతాలాచరిస్తున్న భక్తులు

వ్రతాలకు విస్తృత ఏర్పాట్లు

కార్తిక మాసంలో రత్నగిరికి వస్తున్న భక్తుల్లో అత్యధిక శాతం మంది సత్యదేవుని వ్రతాలు ఆచరిస్తున్నారు. వీరికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా విస్తృత ఏర్పాట్లు చేశాం. పర్వదినాల్లో వేకువజామున ఒంటి గంట నుంచే వ్రతాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. అదనపు వ్రత మండపాలతో పాటు తోపులాట, తొక్కిసలాట జరగకుండా కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశాం. కార్తిక పౌర్ణమి పర్వదినం నాడు 10 వేల వ్రతాలు జరిగినా భక్తులకు ఎక్కడా ఇబ్బంది కలగలేదు. భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. – కె.రామచంద్ర మోహన్‌, కార్యనిర్వహణాధికారి, అన్నవరం దేవస్థానం

No comments yet. Be the first to comment!
Add a comment
సరికొత్త రికార్డు దిశగా..1
1/2

సరికొత్త రికార్డు దిశగా..

సరికొత్త రికార్డు దిశగా..2
2/2

సరికొత్త రికార్డు దిశగా..

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement