నీడనిస్తున్నావా స్వామీ! | - | Sakshi
Sakshi News home page

నీడనిస్తున్నావా స్వామీ!

Published Wed, Dec 11 2024 12:06 AM | Last Updated on Wed, Dec 11 2024 12:06 AM

నీడని

నీడనిస్తున్నావా స్వామీ!

సత్యదేవుని భక్తుల కోసం రత్నగిరిపై షెడ్ల నిర్మాణం

టోల్‌గేట్‌, తూర్పు రాజగోపురం వద్ద ఏర్పాటు

త్వరలో పశ్చిమ రాజగోపురం వద్ద కూడా..

అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు ఎండకు ఎండి, వానకు తడిసే పరిస్థితుల నుంచి ఉపశమనం లభించనుంది. స్వామివారి మొదటి ఘాట్‌ రోడ్డు వద్ద రూ.60 లక్షలతో, రత్నగిరిపై తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో రాజమండ్రి పేపర్‌ మిల్లు సహకారంతో విశ్రాంతి షెడ్ల నిర్మాణాలు మొదలయ్యాయి. భక్తులకు నీడనిచ్చే ఈ పనులు వారం రోజుల్లో పూర్తి కానున్నాయి.

ప్రస్తుతం ఒక్కటే షెడ్డు

సత్యదేవుని ఆలయానికి ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు వచ్చి, వ్రతాలాచరించి, స్వామివారి దర్శనం చేసుకుంటారు. ఇటీవల ముగిసిన కార్తిక మాసంలో లక్షలాదిగా భక్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఇలా వస్తున్న భక్తుల కోసం రామాలయం వద్ద 2022లో దాత సహాయంతో అప్పటి, ప్రస్తుత ఈఓ వి.త్రినాథరావు హయాంలో విశ్రాంతి షెడ్డు నిర్మించారు. ఇది మినహా రత్నగిరిపై మరెక్కడా విశ్రాంతి షెడ్లు లేవు.

ప్రణాళికలకే పరిమితమై..

ఈ పరిస్థితుల్లో 2023లో ఈఓగా పని చేసిన ఎస్‌ఎస్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ హయాంలో లారెల్స్‌ ల్యాబ్స్‌ ఆర్థిక సహకారంతో రూ.2 కోట్ల వ్యయంతో పశ్చిమ రాజగోపురం వద్ద భారీ విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. అలాగే, మొదటి ఘాట్‌ రోడ్డు టోల్‌గేట్‌ వద్ద కూడా రూ.90 లక్షలతో తిరుపతి అలిపిరిలో మాదిరిగా విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి, రత్నగిరిపై తూర్పు రాజగోపురానికి ఇరువైపులా రాజమండ్రి పేపర్‌ మిల్లు యాజమాన్యం సహకారంతో విశ్రాంతి షెడ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన బదిలీ అనంతరం ఈ నిర్మాణాల గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో, టోల్‌గేట్‌ వద్ద నుంచి రత్నగిరిపై సత్యదేవుని ఆలయం వరకూ భక్తులు ఎండకు ఎండి, వానకు తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల సమస్యలపై శ్రీసాక్షిశ్రీ చాలాసార్లు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన అధికారులు అదిగో ఇదిగో అని కాలయాపన చేశారు.

తాత్కాలిక షెడ్లకు రూ.15 లక్షల వ్యయం

ఇటీవల ముగిసిన కార్తిక మాసంలో భక్తుల కోసం రూ.15 లక్షలు ఖర్చు పెట్టి మరీ తాత్కాలిక విశ్రాంతి షెడ్లు వేశారు. కార్తికం ముగిసిన అనంతరం వాటిని తొలగించారు. దీనివలన రూ.లక్షలు వృథా అయ్యాయే తప్ప భక్తుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఈవిధంగా దేవస్థానం నిధులతో తాత్కాలిక షెడ్లు వేయడం కన్నా.. దాతల సహకారంతో శాశ్వత ప్రాతిపదికన నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే శాశ్వత షెడ్ల నిర్మాణానికి అధికారులు తాజాగా శ్రీకారం చుట్టారు.

టోల్‌గేట్‌ వద్ద రూ.60 లక్షలతో..

మొదటి ఘాట్‌ రోడ్డు టోల్‌ గేటు వద్ద కూడా మరో షెడ్డు నిర్మాణం చేపట్టారు. దీనిని 70 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పున జియో షీట్స్‌తో నిర్మిస్తున్నారు. పూర్వపు ఈఓ చంద్రశేఖర్‌ ఆజాద్‌ హయాంలో రూ.90 లక్షలతో పాత ట్రాన్స్‌పోర్టు కార్యాలయం వరకూ ఈ షెడ్డు నిర్మించేలా ప్రతిపాదించారు. అయితే గత ఈఓ కె.రామచంద్ర మోహన్‌ ఈ పనిని కొంత కుదించి రూ.60 లక్షలకు ఖరారు చేశారని అధికారులు తెలిపారు.

రూ.88 లక్షలతో మరో షెడ్డుకు ఆమోదం

పశ్చిమ రాజగోపురం ఎదురుగా రూ.88 లక్షల వ్యయంతో 100 అడుగుల పొడవు, 88 అడుగుల వెడల్పున టెన్‌సిల్‌ మెటీరియల్‌తో షెడ్డు నిర్మాణానికి రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్‌ ఆమోదం తెలిపారు. దీని నిర్మాణానికి త్వరలో టెండర్లు పిలవనున్నారు. గతంలో చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఈఓగా ఉన్నప్పుడు లారెల్స్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ రూ.1.99 కోట్ల వ్యయంతో విశ్రాంతి షెడ్డు నిర్మాణానికి ముందుకు వచ్చింది. రామాలయం వద్ద ఉన్న విశ్రాంత షెడ్డు మాదిరిగా జియో షీట్లతో పెద్ద షెడ్డు వేయాలని ప్రణాళిక. అయితే ఆయన బదిలీ అయ్యాక ఈ షెడ్డును టెన్‌సిల్‌ మెటీరియల్‌తో దేవస్థానం నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు మళ్లీ లారెల్స్‌ సంస్థ సహకారంతో షెడ్డు నిర్మాణానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

వారం రోజుల్లో పూర్తి

దేవస్థానం మొదటి ఘాట్‌ రోడ్డు టోల్‌ గేటు వద్ద, తూర్పు రాజగోపురం వద్ద చేపట్టిన విశ్రాంతి షెడ్ల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తవుతాయి. అనంతరం వీటిని భక్తులకు అందుబాటులోకి తెస్తాం. పశ్చిమ రాజగోపురం ఎదురుగా రూ.88 లక్షలతో నిర్మించనున్న విశ్రాంతి షెడ్డుకు త్వరలోనే టెండర్లు పిలుస్తాం.

– వి.రామకృష్ణ, ఈఈ, అన్నవరం దేవస్థానం

తూర్పు రాజగోపురం వద్ద రూ.40 లక్షలతో..

రాజమండ్రి పేపర్‌ మిల్లు సహకారంతో రూ.40 లక్షల వ్యయంతో తూర్పు రాజగోపురం వద్ద విశ్రాంతి షెడ్లు నిర్మిస్తున్నారు. రాజగోపురం ప్రాంగణంలో ఆంగ్ల అక్షరం ఎల్‌ నమూనాలో వీటి నిర్మాణం చేపడుతున్నారు. తీర్థ ప్రసాదాలు తీసుకుని భక్తులు బయటకు వచ్చేచోట ఉన్న మెట్ల నుంచి రావిచెట్టు వరకూ 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పున.. రథ్‌పాత్‌లో 55 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పున రావిచెట్టు వరకూ ఐరన్‌ గట్టర్స్‌తో ఈ షెడ్లు నిర్మిస్తున్నారు. వీటిపై తెల్లటి టెన్‌సిల్‌ మెటీరియల్‌ పై కప్పుగా వేయనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
నీడనిస్తున్నావా స్వామీ!1
1/3

నీడనిస్తున్నావా స్వామీ!

నీడనిస్తున్నావా స్వామీ!2
2/3

నీడనిస్తున్నావా స్వామీ!

నీడనిస్తున్నావా స్వామీ!3
3/3

నీడనిస్తున్నావా స్వామీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement