ప్రజల తరఫున ఉద్యమాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కార్యకర్తల మనోభావాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని శాసన మండలిలో విపక్ష నేత, వైఎస్సార్ సీపీ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. మాజీ మంత్రి, పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అధ్యక్షతన స్థానిక సూర్య కళా మందిర్‌లో మంగళవారం జరిగిన వైఎస్సార్ సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వ దమనకాండతో అన్యాయానికి గురయ్యే ప్రతి కార్యకర్తకు నాయకత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆరు నెలలుగా కూటమి ప్రభుత్వం అకృత్యాలు సాగిస్తోందన్నారు. ఈ తరుణంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచి, భవిష్యత్తుపై దిశానిర్దేశం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చే నెల నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి పార్టీ కమిటీలను ఈ నెలాఖరులోగా నియమించాలని సూ చించారు. ఈ కమిటీలను బలీయంగా తీసుకువచ్చి, జిల్లాల సమావేశాలు ఏర్పాటు చేసుకుందామని అన్నారు.
విద్యుత్ చార్జీల పెంపుపై..
విద్యుత్ చార్జీలు ఒక్క పైసా కూడా పెంచేది లేదని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మించి, ఇప్పుడు మోసం చేశారని బొత్స చెప్పారు. ఇప్పుడు ప్రతి వినియోగదారుపై యూనిట్‌కు రూ.1.20 చార్జీల భారం మోపుతున్నారని, దీనిని వెనక్కు తీసుకునేంత వరకూ ప్రజల తరఫున పోరాడాలని అన్నారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న ఎస్‌ఈ కార్యాలయాల వద్ద నిర్వహించే ఆందోళనకు అందరూ కలసి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరు నెలల్లో రూ.60 వేల కోట్లు అప్పులు తెచ్చి, కనీసం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్ము కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ ఆరు నెలల్లో ఏం ఉద్ధరించారని ప్రశ్నించారు. ఈ అంశంపై వచ్చే నెల 3న విద్యార్థులకు సంఘీభావంగా నిరసన తెలపాలని బొత్స సూచించారు.
తొలుత మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నేతలు జ్యోతి ప్రజ్వలనతో నివాళులర్పించారు. పార్టీ ప్రతినిధులను వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. సమావేశంలో ఎమ్మెల్సీ అనంతబాబు, జెడ్పీ వైస్ చైర్మన్ అనుబాబు, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు, డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, పాముల రాజేశ్వరీదేవి, పెద్దాపురం, రామచంద్రపురం, ప్రత్తిపాడు కో ఆర్డినేటర్లు దవులూరి దొరబాబు, పిల్లి సూర్యప్రకాష్, ముద్రగడ గిరిబాబు, పార్టీ నాయకుడు యనమల కృష్ణుడు, మున్సిపల్ చైర్‌పర్సన్లు రెడ్డి సత్యనాగేంద్రమణి, పతివాడ నూకదుర్గారాణి, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, కౌడా మాజీ చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర అధ్యక్షరాలు సుంకర శివప్రసన్న సాగర్, ఏఎంసీ మాజీ చైర్‌పర్సన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ మేయర్ సరోజ, అనుబంధ విభాగాల ప్రతినిధులు గిరజాల బాబు, జిన్నూరి వెంకటేశ్వరరావు, కర్రి పాపారాయుడు, చెల్లుబోయిన శ్రీనివాస్, ముదునూరి మురళీకృష్ణరాజు, శెట్టిబత్తుల రాజబాబు, పితాని బాలకృష్ణ, కొవ్వూరి త్రినాథ్‌రెడ్డి, ఉలవకాయల లోవరాజు, పేపకాయల వెంకటలక్ష్మి, పిల్లంక శ్రీనివాసరాజు, సబ్బెళ్ల కృష్ణారెడ్డి, కుడుపూడి భరత్ భూషణ్, కుడుపూడి బాబు, వాసిరెడ్డి జమీలు, తోట రామకృష్ణ, అల్లి రాజబాబు, లాలం బాబ్జీ, ఒమ్మి రఘురామ్, జమ్మలమడక నాగమణి పాల్గొన్నారు.
ఎన్నికల హామీలు గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజల తరఫున పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు బొత్స పిలుపునిచ్చారు. అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన పార్టీ రాష్ట్ర స్థాయి సమీక్షలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా.. ప్రభుత్వంపై మూడు దశల్లో ఆందోళనకు అందరూ సమాయత్తం కావాలని అన్నారు. రైతు సమస్యలపై ఈ నెల 13న కలెక్టర్లకు విజ్ఞాపనలు అందజేయాలని సూచించారు. అధిక వర్షాలు, వాయుగుండాలతో తడిసిన పంటను కూటమి ప్రభుత్వం కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకుండా రైతులకు అన్యాయం చేస్తోందని, వారి పక్షాన సర్కార్ తీరును ఎండగట్టాలని అన్నారు. రైతులకు రూ.20 వేలు ఇస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో చెప్పారని, ఇప్పుడు అన్నదాతలను మోసం చేసి, ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారని విమర్శించారు. అసలు ఆ సొమ్ము ఎప్పుడిస్తారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment