గ్రామ సభలతో రెవెన్యూ సమస్యల పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

గ్రామ సభలతో రెవెన్యూ సమస్యల పరిష్కారం

Published Wed, Dec 11 2024 12:06 AM | Last Updated on Wed, Dec 11 2024 12:06 AM

-

కలెక్టర్‌ షణ్మోహన్‌

పెద్దాపురం: గ్రామాల్లో పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడతాయని కలెక్టర్‌ షణ్మోహన్‌ అన్నారు. మండలంలోని గోరింట గ్రామంలో మంగళవారం ఆర్డీఓ కె.శ్రీరమణ అధ్యక్షతన గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కలెక్టర్‌ షణ్మోహన్‌ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధిలో రెవెన్యూ సదస్సులది కీలక పాత్ర అని, ప్రణాళిక ప్రకారం జిల్లాలో వచ్చే నెల 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. సదస్సులలో రెవెన్యూ సమస్యల పరిష్కరానికి కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం రెవెన్యూ పరంగా వచ్చిన అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజా సూరిబాబు రాజు, సర్పంచ్‌ మేరీ కుమారి, తహసీల్దార్‌ సీహెచ్‌ వెంకటలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సౌదీలో నర్సింగ్‌ ఉద్యోగావకాశాలు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఓమ్‌ క్యాప్‌, ఆల్‌ యూసుఫ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆధ్వర్యాన బీఎస్సీ నర్సింగ్‌ చదివిన వారికి సౌదీ అరేబియాలో నర్సింగ్‌ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కొండలరావు మంగళవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సౌదీ అరేబియా రీహేబిలిటేషన్‌ సెంటర్‌లో పని చేయడానికి ఆసక్తి ఉన్న 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఏదైనా ఆసుపత్రిలో ఏడాదిన్నర పాటు పని చేసిన అనుభవం ఉండాలన్నారు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.37,500 చెల్లించాలని, వీసా, విమాన టికెట్లు ఇందులోనే కలిపి ఉంటాయని పేర్కొన్నారు. ఎంపికై న వారికి నెలకు రూ.78 వేల నుంచి రూ.89 వేల వరకూ జీతం వస్తుందన్నారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 15లోగా 99888 53335 లేదా 8790 11 8349 మొబైల్‌ నంబర్లలో సంప్రదింవచ్చని కొండలరావు సూచించారు.

ఎస్సీ ఉప వర్గీకరణపై వినతులకు 1 వరకూ గడువు

కాకినాడ సిటీ: షెడ్యూల్డ్‌ కులాలల్లో ఉప వర్గీకరణపై విచారణకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రాజీవ్‌ రంజన్‌ మిశ్రా నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ప్రభుత్వం నియమించిందని కలెక్టర్‌ షణ్మోహన్‌ సగిలి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉప వర్గీకరణపై సంతకంతో కూడిన రాత పూర్వక వినతులను కార్యాలయపు పని వేళల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ వ్యక్తిగతంగా లేదా తిరుగు రసీదుతో కూడిన రిజిస్టరు పోస్టు లేదా ఈ–మెయిల్‌ ద్వారా జనవరి 1వ తేదీ లోపు ఈ కమిషన్‌కు సమర్పించవచ్చని వివరించారు. శ్రీగిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయం మొదటి అంతస్తు, కోనేరు లక్ష్మయ్య వీధి, మొఘల్రాజపురం, విజయవాడ–520010 చిరునామాలో ఈ ఏకసభ్య కమిషన్‌ కార్యాలయం ఏర్పాటు చేశారని తెలిపారు.

దళారుల దోపిడీతో దక్కని మద్దతు ధర

కరప: ప్రభుత్వ మద్దతు ధర దక్కనీయకుండా, దళారీలు రేటు తగ్గించి, రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయమని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజబాబు మండిపడ్డారు. కరప, వలసపాకల, పెదకొత్తూరు, యండమూరు, పెనుగుదురు తదితర గ్రామాల్లో మంగళవారం ఆయన పర్యటించారు. రోడ్ల పక్కన, లే అవుట్లలో ఆరబెట్టిన ధాన్యం రాశులను పరిశీలించారు. ధాన్యం ఎలా అమ్ముతున్నారు, మద్దతు ధర అందుతోందా తదితర విషయాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజబాబు స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ, ప్రభుత్వ మద్దతు ధర ప్రకారం 75 కిలోల బస్తాను రూ.1,725కు కొనుగోలు చేయాల్సి ఉండగా.. రూ.1,620కి కొనుగోలు చేస్తున్నారని రైతులు చెప్పారన్నారు. అలాగే, తేమ శాతం పేరుతోను, గుర్తింపు కార్డు లేని కౌలు రైతుల నుంచి కొంత మంది దళారులు మరో రూ.50 కోత పెడుతున్నారని తెలిపారు. దీంతో రైతు బస్తాకు రూ.100 నుంచి రూ.150 నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు గుర్తింపు కార్డు లేక ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవడం ద్వారా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. గుర్తింపు కార్డు ఉన్న రైతుల నుంచి తూకం, రవాణా ఖర్చులంటూ దోచుకుంటున్నారన్నారు. అధికారులు వెంటనే స్పందించి, దళారుల దోపిడీని అరికట్టి, మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేయాలని రాజబాబు డిమాండ్‌ చేశారు.

10జెపిటి21:

గోరింట రెవెన్యూ సదస్సులో

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ షణ్మోహన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement