డమ్మీ తుపాకీతో బెదిరించి నగలు చోరీ
● కాకినాడ తనిష్క్ జ్యువెలరీ షోరూంలో ఘటన
● దొంగను వెంబడించి పట్టుకున్న పోలీసులు
కాకినాడ క్రైం: డమ్మీ తుపాకీతోతో బెదిరించి, బంగారం దుకాణం నుంచి ఆభరణాలను ఎత్తుకెళ్లిన ఘటన కాకినాడలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని దేవాలయంలో వీధిలో ఉన్న తనిష్క్ జ్యువెలరీ షోరూంకు బుధవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి వచ్చాడు. జెంట్స్ ఆర్న్‌మెంట్స్ విభాగానికి వెళ్లి తనకు గోల్డ్ కాయిన్లు, బంగారు గొలుసులు చూపించాలని అక్కడి సేల్స్‌మన్‌ను అడిగాడు. వాటిని చూపిస్తూ ఉండగా ఒక్కసారిగా తన వద్ద ఉన్న తుపాకీ తీసి గురిపెట్టాడు. సేల్స్‌మన్‌ను బెదిరించి ఆ బంగారు గొలుసులు తన జేబులో కుక్కుకుని పరారయ్యాడు. షోరూం భద్రతా సిబ్బంది తేరుకునే సరికి రెప్పపాటులో మాయమయ్యాడు. సెక్యూరిటీ సిబ్బంది సమాచారం మేరకు లా అండ్ ఆర్డర్‌తో సహా ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ దొంగను వెంబడించి వార్ఫ్ రోడ్డులో పట్టుకున్నారు. అతడి నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది 39 గ్రాములు ఉందని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుడిని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన నూకల సతీష్‌గా గుర్తించామని వన్ టౌన్ సీఐ నాగదుర్గారావు, ట్రాఫిక్ సీఐ నూని రమేష్ తెలిపారు. అతడు బెంగళూరులో కొన్నాళ్లు ఉద్యోగం చేశాడని, ప్రస్తుతం ఆవారాగా తిరుగుతున్నాడని అన్నారు. దొంగను ట్రాఫిక్ పోలీస్ ఎన్‌వీ రమణ వెంబడించి పట్టుకున్నాడని తెలిపారు. నిందితుడు వినియోగించింది ఓ డమ్మీ తుపాకీ అని తేల్చారు. అతడిపై పాత కేసులు ఏవైనా ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. తక్షణమే స్పందించిన ట్రాఫిక్ పోలీస్ రమణ సహా సీఐలు నాగదుర్గారావు, నూని రమేష్‌ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.
హాకీ పోటీలకు అక్ను జట్టు ఎంపిక
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): తమిళనాడులోని తిరుచినాపల్లి భారతీదాస్ యూనివర్సిటీలో ఈ నెల 26 నుంచి జరిగే అంతర్ యూనివర్సిటీ హాకీ పోటీలకు అక్ను జట్టు ఎంపిక చేశారు. స్థానిక డీఎస్‌ఏ హాకీ మైదానంలో కోచ్ రవిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 18 మందిని ఎంపిక చేశారు. కళాశాల పీడీలు వర్మ, రమణ, కోచ్ నాగేంద్ర పాల్గొన్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో ప్రతిభ
పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన అక్ను పవర్ లిఫ్టింగ్ పురుషులు, మహిళల పోటీల్లో ఇదే కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. పురుషుల విభాగంలో రెండు బంగారు, మూడు రజత, నాలుగు కాంస్య పతకాలతో పాటు, టీం చాంపియన్‌షిప్‌ను సాధించినట్టు పీడీ రమణ తెలిపారు. అలాగే మహిళల విభాగంలో రెండు బంగారు, ఒక రజత పతకం సాధించారు.
బీచ్‌లో కారు నుంచి బంగారం చోరీ
కాకినాడ రూరల్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం పసలపూడికి చెందిన కొవ్వూరి రామచంద్రారెడ్డికి చెందిన కారులోని 40 కాసులు బంగారు వస్తువులు కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్‌లో చోరీకి గురైన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తిమ్మాపురం పోలీసుల వివరాల మేరకు, ఆదివారం కాకినాడ వచ్చిన రామచంద్రారెడ్డి, కుటుంబ సభ్యులు బీచ్‌ను సందర్శించేందుకు కారుకు తాళం వేసి వెళ్లారు. కొద్దిసేపు బీచ్‌లో గడిపి, తిరిగి ప్రయాణమయ్యారు, మార్గంలో కారులో ఉంచిన బంగారు వస్తువులను పరిశీలించగా, కనిపించ లేదు. దీంతో వెనక్కి చేరుకుని బీచ్‌లో విచారించి, అక్కడ నుంచి తిమ్మాపురం పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్సై రవీంద్రబాబు తెలిపారు., బహిరంగ మార్కెట్‌లో సొత్తు విలువ రూ.20 లక్షల పైబడి ఉండగా, పోలీసులు మాత్రం రూ.6.90 లక్షలు ఉంటుందని నమోదు చేశారు. రూరల్ సీఐ చైతన్యకృష్ణ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment