వేట్లపాలెం హత్యల కేసులో 12 మంది అరెస్టు
సామర్లకోట: వేట్లపాలెంలో జరిగిన దారుణ హత్యల ఘటనలో 12 మందిని అరెస్టు చేసినట్టు పెద్దాపురం డీఎస్పీ డి.శ్రీహరిరాజు తెలిపారు. సామర్లకోట పోలీసు స్టేషన్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి కర్దాల చంద్రరావు, ప్రకాశరావు, ఏసుబాబును కొందరు కత్తులతో దాడి చేసి హత్య చేసిన విదితమే. ఈ మేరకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు. వేట్లపాలెం ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని జీవీకే పవర్ ప్లాంట్ వద్ద బుధవారం మధ్యాహ్నం 2.15 గంటలకు 12 మందిని అరెస్టు చేశారు. పాతకక్షలు కూడా ఈ ఘటనకు కారణమని డీఎస్పీ తెలిపారు.
కత్తులు, కర్రలు, ఆటో స్వాధీనం
ప్రధాన నిందితులైన బచ్చల జకరయ్య, మోసే, బుల్లెప్పి, దొరయ్య, రాము, గోపిన, గవరయ్య, రాజు, సూర్యకాంతం, భాగ్యవతి, ద్రోణం సత్యవేణి, కొత్తపల్లి చిన్నిలను పోలీసులు అరెస్టు చేశామని డీఎస్పీ తెలిపారు.దాడికి ఉపయోగించిన ఐదు కత్తులు, మూడు కర్రలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని, వాటిని ఎక్కడి నుంచి తీసుకువచ్చారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. రెండు వర్గాల మధ్య మూడు నెలలు ఈ వివాదం జరుగుతున్నా పోలీసులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. పండు కాకినాడలో పని చేస్తూ ఇంటి నిర్మాణం చేసుకుంటున్నాడని, అపరాధ రుసం చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చనే ఉద్దేశంతో పనులు చేపట్టాడన్నారు. ఈ ఘటనలో 20 మందిని అనుమానితులు కాగా, వారిలో 12 మందిని అరెస్టు చేశామని, వీరందరూ అదే గ్రామానికి చెందిన వారన్నారు. సమావేశంలో సీఐ ఎ.కృష్ణభగవాన్, క్రైం సీఐ అంకబాబు పాల్గొన్నారు.
శ్లాబ్ వేస్తుండగా దాడి
కాగా..మాల చెరువు స్థలం సమీపంలో కార్ధాల పండు ఇంటి నిర్మాణం చేసుకుంటుండగా, దాన్ని అదే గ్రామంలోని ఎస్సీ కులానికి చెందిన బచ్చల జకరయ్య, బచ్చల మోసే, బచ్చల బుల్లెప్పి దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాలల చెరువును ఆక్రమించరాదని, భవన నిర్మాణం చేయరాదని వారు ఎన్ని పర్యాయాలు చెప్పినా పండు నిర్మాణ పనులు ఆపలేదు. దీంతో ఈ నెల 15వ తేదీ సాయంత్రం ఇంటికి శ్లాబ్ వేస్తున్న సమయంలో నిందితులు దాడి చేశారు. ఈ ఘటనలో కార్దల ప్రకాశరావు, కార్దాల చంద్రరావు, కార్దాల ఏసుబాబు మృతి చెందారు. కాగా.. ఈ గ్రామంలో పోలీసు పికెట్ కొనసాగుతోంది.
పాతకక్షలు కూడా కారణమే
డీఎస్పీ శ్రీహరిరాజు
Comments
Please login to add a commentAdd a comment